ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 02:28:11

పుణె విద్యార్థి చిరాగ్‌కు ఫస్ట్‌ ర్యాంకు

పుణె విద్యార్థి చిరాగ్‌కు ఫస్ట్‌ ర్యాంకు

  • బాలికల విభాగంలో కనిష్కకు ప్రథమ స్థానం
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 43,204 మంది అర్హత
  • నేటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ షురూ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 5: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)- అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలను ఐఐటీ-ఢిల్లీ సోమవారం విడుదల చేసింది. పుణెకు చెందిన చిరాగ్‌ ఫాలర్‌ ప్రథమ ర్యాంకు సాధించినట్టు అధికారులు తెలిపారు. 396 మార్కులకు గానూ ఫాలర్‌కు 352 మార్కులు వచ్చినట్టు చెప్పారు. దాదాపు 1.5 లక్షల మంది పరీక్షకు హాజరుకాగా 43,204 మంది అర్హత సాధించినట్టు వివరించారు. ఇందులో 6,707 మంది బాలికలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గంగుల భువన్‌ రెడ్డికి రెండో ర్యాంకు, బీహార్‌కు చెందిన వైభవ్‌ రాజ్‌కు మూడో ర్యాంకు వచ్చింది. 

బాలికల విభాగంలో కనిష్క మిట్టల్‌ ప్రథమ స్థానంలో (మొత్తంగా 17వ ర్యాంకు) నిలిచారు. ఈమెకు 396 మార్కులకుగానూ 315 మార్కులు వచ్చాయి. పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపిన విద్యార్థులను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు. ఆశించిన ర్యాంకు రాని విద్యార్థులు నిరుత్సాహపడొద్దని ధైర్యం చెప్పారు. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో సెప్టెంబర్‌ 1 నుంచి 6 మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జేఈఈ-మెయిన్‌ పరీక్ష జరిగింది. దాదాపు 8.58 లక్షల మంది పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా, ఇందులో దాదాపు 2.5 లక్షల మంది జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఈ పరీక్ష సెప్టెంబర్‌ 27న జరిగింది. నేటి నుంచి నవంబర్‌ 13 వరకు ఆరు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

జేఈఈ పరీక్షనే కష్టం: ఫాలర్‌ 

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన పుణె విద్యార్థి చిరాగ్‌ ఫాలర్‌ అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో విద్యాభ్యాసం చేస్తున్నారు. అయినప్పటికీ, పరీక్షా అనుభవం కోసమని జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌కు హాజరయ్యారు. యూనివర్సిటీలో ప్రవేశం కోసం ఎంఐటీ నిర్వహించిన పరీక్షతో పోలిస్తే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్ష మరింత కఠినంగా ఉన్నదని ఆయన తెలిపారు. 

హార్దిక్‌కు 6వ ర్యాంకు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలలో టాప్‌ టెన్‌లో 6వ ర్యాంకు సాధించిన హార్దిక్‌ రాజ్‌పాల్‌ తెలంగాణ నుంచి పరీక్షలకు హాజరయ్యారు. అయితే అతడు మధ్యప్రదేశ్‌కు చెందిన వారైనప్పటికీ హైదరాబాద్‌ లోని ఒక కార్పొరేట్‌ స్కూల్‌, జూనియర్‌ కాలేజీలలో విద్యనభ్యసించారు. 


logo