సోమవారం 13 జూలై 2020
Telangana - Feb 07, 2020 , 02:20:36

నేటినుంచి జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో

నేటినుంచి జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో
  • ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించనున్న సీఎం, మంత్రులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ మెట్రోరైలు కారిడార్‌-2లోని జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మార్గం శుక్రవారం ప్రారంభం కానున్నది. 11 కిలోమీటర్లున్న ఈ మార్గాన్ని సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రులు కే తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, చామకూర మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మెట్రోరైలులో ఎంజీబీఎస్‌వరకు సీఎం కేసీఆర్‌ ప్రయాణించనున్నారు. 


జేబీఎస్‌ మెట్రోస్టేషన్‌ వద్ద ప్రారంభోత్సవం అనంతరం ఎంజీబీఎస్‌కు మెట్రోలో వెళ్లేమార్గంలో చిక్కడపల్లి స్టేషన్‌లో సీఎం కేసీఆర్‌ సుమారు 5 నిమిషాలపాటు ఆగనున్నారు. స్టేషన్‌ పరిశీలనతోపాటు అక్కడ ప్రజలకు అభివాదంచేసి ఎంజీబీఎస్‌కు బయలుదేరుతారు. ఎంజీబీఎస్‌ స్టేషన్‌ను పరిశీలించిన తర్వాత రోడ్డుమార్గంలో తిరిగి వెళ్తారు. మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా జేబీఎస్‌కు తరలివచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతారు. కాగా, ఈ కారిడార్‌-2లో రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి ఐదంతస్తులతో మెట్రో ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తైన మెట్రోస్టేషన్‌గా జేబీఎస్‌ ఉండగా, దేశంలోనే అతిపెద్ద మెట్రో ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌గా ఎంజీబీఎస్‌ ఉన్నది.


దేశంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా..

మూడు కారిడార్లు 69 కి.మీ. నిర్మించుకొని, ఇప్పటికే రెండు కారిడార్లలో విజయవంతంగా సేవలు అందిస్తూ మిగిలిన కారిడార్‌లోని 11 కిలోమీటర్ల మేర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న హైదరాబాద్‌ మెట్రోరైలు దేశంలోనే ఢిల్లీ మెట్రో తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా ఖ్యాతికెక్కనున్నది. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ప్రారంభానికి సన్నద్ధమవడంతో దాదాపు మొదటిదశ మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయింది. 


ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్‌ ప్రైవేట్‌ ప్రాజెక్టు (పీపీపీ)గా నిర్మించిన హైదరాబాద్‌ మెట్రోరైలు అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీవోటీ) విధానంలో హైదరాబాద్‌ మెట్రో నిర్మించారు. పీపీపీ విధానంలో ప్రపంచంలో 200 మెట్రోరైలు ప్రాజెక్టులు నిర్మించగా, ఇందులో ఏడు మాత్రమే విజయ వంతమయ్యాయి. వీటిలో హైదరాబాద్‌ మెట్రోరైలు ఉండటం విశేషం. కారిడార్‌-2లోని జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మెట్రోమార్గం అందుబాటులోకి రావడం ద్వారా కారిడార్‌- 1, కారిడార్‌- 3 మార్గాలకు అనుసంధానం కావడంతోపాటు నగర ప్రయాణికులు ఏ మూలనుంచైనా మరో ప్రాంతానికి వెళ్లవచ్చు. ఉత్తర తెలంగాణతోపాటు దక్షిణ తెలంగాణకు కూడా కనెక్టివిటీ పెరుగనున్నది.


11 కిలోమీటర్లు.. తొమ్మిది స్టేషన్లు

కారిడార్‌-2లోని జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వస్తున్నది. రోడ్డు మార్గం ద్వారా అనేక అవాంతరాలతో ప్రయాణిస్తే గంటా 10 నిమిషాలు సమయం పడుతుంది. అదే మెట్రోరైలులో ప్రయాణిస్తే 11 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ మార్గంలో తొమ్మిది స్టేషన్లుంటాయి. జేబీఎస్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ దవాఖాన, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ స్టేషన్లు ఉన్నాయి.


logo