ఆదివారం 24 మే 2020
Telangana - Feb 28, 2020 , 00:23:49

మైనింగ్‌ వర్సిటీకి సిద్ధం!

మైనింగ్‌ వర్సిటీకి సిద్ధం!
  • సాంకేతిక సేవలతో పరిశ్రమలు స్థాపించండి
  • ఆస్ట్రేలియా- ఇండియా బిజినెస్‌ ఎక్స్చేంజ్‌ సదస్సులో జయేశ్‌రంజన్‌ పిలుపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : సాంకేతిక సేవలతో తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావాలని, మైనింగ్‌ విద్యలో అత్యుత్తమ యూనివర్సిటీ స్థాపనకు తాము అవకాశం కల్పించనున్నామని ఐటీశాఖ ముఖ్య కారద్యర్శి జయేశ్‌రంజన్‌ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఆస్ట్రేలియా ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆస్ట్రేలియా- ఇండియా బిజినెస్‌ ఎక్స్చేంజ్‌ సదస్సులో సింగరేణి, ఎన్‌ఎండీసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గనులు, ఖనిజాలశాఖల అధికారులతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన 11 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ.. సింగరేణి వంటి బొగ్గు ఉత్పత్తి సంస్థతోపాటు సిమెంట్‌, గ్రానైట్‌, ఇసుక తయారీ విభాగాల్లో ఆధునిక సాంకేతికత ఎంతో అవసరమని, సంబంధిత యంత్రాలు, వస్తువులు ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి ఎగుమతిచేయడం కన్నా, ఇక్కడే పరిశ్రమలు స్థాపించుకొని వ్యాపారం నిర్వహించుకోవాలని ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటు విభాగంలో దేశంలోనే తెలంగాణ ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నదని, త్వరలోనే అగ్రస్థానానికి చేరుకొంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. టీఎస్‌ఐపాస్‌ వల్ల ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాయని, ఆస్ట్రేలియా కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 


85 మిలియన్‌ టన్నుల బొగ్గు: చంద్రశేఖర్‌

దేశ, రాష్ట్ర ఇంధన అవసరాల రీత్యా 2025 నాటికి 85 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని సింగరేణి డైరెక్టర్‌ చంద్రశేఖర్‌  చెప్పారు. ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సహకారాన్ని అందిపుచ్చుకోనున్నట్టు తెలిపారు. 2006లో ఆస్ట్రేలియాకు చెందిన సిస్రో సంస్థతో బొగ్గు గనుల్లో వివిధసాంకేతిక అధ్యయనాలపై ఒప్పందం కుదుర్చుకొన్నామని, దీంతోపాటు రక్షణ, ఉద్యోగులకు పలు అంశాలపై శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. భూగర్భ, ఉపరితల గనుల్లో వివిధరకాల యంత్రాలు, టెక్నాలజీని ఆస్ట్రేలియానుంచి కొనుగోలు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో జీఎంలు రవిశంకర్‌, పీ సత్తయ్య, అడ్వయిజర్‌ మైనింగ్‌ డీఎన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.


logo