బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:40:59

పచ్చిరొట్ట.. భూమికి బలం

పచ్చిరొట్ట.. భూమికి బలం

  • తొలకరి పలకరించగానే జనుము, జీలుగ, పెసర వేయండి
  • రైతులకు జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు పొలాల్లో పచ్చిరొట్ట సాగు చేసుకోవాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడానికి, భూసారాన్ని పెంచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నది. ‘వరిలో పచ్చిరొట్ట పైర్లు- ప్రాముఖ్యత’పై విశ్వవిద్యాలయం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. తొలకరి వానలు పడగానే పొలాల్లో జనుము, జీలుగ, పిల్లిపెసర, పెసర మొదలైన పచ్చిరొట్ట విత్తనాలను వేసుకోవాలని, అవి 50 శాతం పూత దశ (45-60 రోజుల వయసు)కు వచ్చాక భూమిలో కలియదున్ని నాట్లు వేసుకోవాలని తెలిపింది. వేప, తంగేడు, కానుగ ఆకులను వేసి మురిగాక దమ్ము చేసుకొని వరినాట్లు వేసుకోవాలని వెల్లడించింది.

ఏ పైరులో ఏం ఉంటుంది..

జీలుగ: చౌడు, వరి పండించే క్షార గుణం గల భూముల్లో దీన్ని వేయాలి. ఈ మొక్కల్లో 3.5శాతం నత్రజని, 0.6శాతం భాస్వరం, 1.2శాతం పొటాష్‌ (డ్రై వెట్‌ బేసిన్‌) ఉంటాయి.

జనుము: అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఇది పశువులకు మేతగా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో 2.3 నత్రజని, 0.5శాతం భాస్వరం, 1.8 శాతం పొటాష్‌ ఉంటాయి.

పెసర: తేలిక, బరువైన నేలల్లో ఈ పైరు సాగుచేసుకోవచ్చు. దీనిని ఆహారంగా, పచ్చిరొట్ట ఎరువుగా, పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. చౌడు భూముల్లో వేయొద్దు. 

వేప: ఈ కొమ్మలు, ఆకులను బయటి నుంచి తీసుకొచ్చి పొలంలో వేసి కలియదున్ని మురగనివ్వాలి. దీనివల్ల అనేక పోషకాలు పంటలకు అందుతాయి. క్రిమిసంహారక మందుగా ఉపయోగపడుతుంది. ఇందులో 2.8 శాతం నత్రజని ఉంటుంది.

ైగ్లెరిసిడియా: గట్ల మీద, బావుల సమీపంలో ైగ్లెరిసిడియా పెంచి కొమ్మలను, ఆకులను తీసుకొచ్చి పొలంలో కలియదున్నాలి. 2.8శాతం నత్రజని, 0.28 శాతం భాస్వరం, 4.6 శాతం పొటాష్‌ ఉంటా యి. కానుగ, జిల్లేడు, నేల తంగేడు, కొండ మిరప పచ్చి ఆకులను కూడా పచ్చిరొట్టగా వాడుకోవచ్చు.  

ప్రయోజనాలు:

  • పచ్చిరొట్టలో సేంద్రియ పదార్థాలుంటాయి. వీటివల్ల సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది.
  • నేలలో లభ్యం కానీ అనేక పోషకాలు పచ్చిరొట్ట వల్ల దొరుకుతాయి.
  • కలుపు మొక్కలు పెరగకుండా ఆపవచ్చు.
  • పచ్చిరొట్ట పైర్ల సాగుతో భాస్వరం, గంధకం మొదలైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
  • జీలుగ, సీమ జీలుగ చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడుతాయి.


logo