శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 06:45:00

జయహో ‘జనతా’.. రాష్ట్రంలో ‘కర్ఫ్యూ’ విజయవంతం

జయహో ‘జనతా’.. రాష్ట్రంలో ‘కర్ఫ్యూ’ విజయవంతం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆదివారం చేపట్టిన ‘జనతా కర్ఫ్యూ’కు జనం జై కొట్టడంతో భాగ్యనగరం ప్రశాంతతను తలపించింది. ఎన్నడూ లేనంత శాంతంగా కనిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు జనం స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఒక్కరూ కూడా ఇండ్ల నుంచి బయటికిరాకపోవడం గమనార్హం. మొత్తంగా కర్ఫ్యూ  విజయవంతమైంది. వాహనాలు రోడ్డెక్కకపోవడం, జనం ఇండ్లకే పరిమితం కావడంతో, రోడ్లన్నీ బోసిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం క్రికెట్‌ పిచ్‌లను తలపించాయి. వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే నాంపల్లి, లక్డీకాపూల్‌, అబిడ్స్‌, హిమాయత్‌నగర్‌, కూకట్‌పల్లి, బేగంపేట, అమీర్‌పేట ప్రాంతాల్లోని రోడ్లన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. నిమిషం కుడా ఖాళీగా కనిపించని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌లో సందడి కనిపించకపోవడం గమనార్హం. హైటెక్‌ సిటీ జంక్షన్‌, బషీర్‌బాగ్‌ ప్రాంతాల్లో జనసందోహం లేక నిర్మానుష్య వాతావరణం రాజ్యమేలింది. రోడ్లు ఖాళీగా ఉండటంతో పశువులు, పక్షులు, పావురాలు తమకోసమే వదిలేసినట్లుగా స్వేచ్ఛ విహారం చేశాయి.

ఊరట.. :  నగర రోడ్లపై ఇది వరకటిలా వాహనాల రద్దీ లేకపోవడంతో ఇక్కడున్న వారంతా హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటున్నారు. నరకయాతన అనుభవించిన నగర వాసులు కాస్త ఊరట చెందారు. ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించారు. వాహనాలు రయ్‌మంటూ దూసుకుపోయేలా రోడ్లన్నీ ఖాళీగా ఉండటంతో ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుండునో అంటూ చర్చించుకోవడం గమనార్హం.   

తగ్గిన కాలుష్యం.. :  వాహనాలు రోడ్డెక్కకపోవడం, ట్రాఫిక్‌ రద్దీ లేకపోవడంతో గ్రేటర్‌లో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గింది. 50 శాతానికి పైగా కాలుష్యం తగ్గినట్లుగా పీసీబీ అధికారులు చెబుతున్నారు. కార్బన్‌, పీఎం 10, పీఎం 2.5, నైట్రోజన్‌డయాక్సైడ్‌, సల్పర్‌డైయాక్సైడ్‌, ఓజోన్‌ వాయువుల తేడాలు కనిపించాయి. నగరంలో శబ్దకాలుష్యం సైతం గణనీయంగా తగ్గడం గమనార్హం. ఆదివారం నగరంలో 49 డెసిబుల్స్‌ శబ్దకాలుష్యం నమోదైంది. వాహనాల రణగొణ ధ్వనులు, బ్యాండ్‌బాజాలు, సౌండ్‌సిస్టం  వినియోగించడంతో శబ్దకాలుష్యం తీవ్రతల్లో భారీ తేడాలుంటున్నాయి. సరాసరిగా ప్రతిరోజూ 70 -100 డెసిబుల్స్‌ వరకు శబ్దకాలుష్యం వెలువడేది. పరిమితి 40 డెసిబుల్స్‌ మాత్రమే ఉండగా, అందుకు మించి కాలుష్యం నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నది. కర్ఫ్యూ పుణ్యమాని 30 శాతం వరకు శబ్దకాలుష్యం తగ్గడం విశేషం.  


logo