e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home Top Slides టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌తోపాటు ఏడుగురు సభ్యులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిపాదనలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా రమావత్‌ ధన్‌సింగ్‌ (బీటెక్‌-సివిల్‌, రిటైర్డ్‌ ఈఎన్సీ), ప్రొఫెసర్‌ బీ లింగారెడ్డి (ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఫిజిక్స్‌ విభాగాధిపతి, సీబీఐటీ), కోట్ల అరుణకుమారి (బీఎస్సీ బీఈడీ, ఎంఏ ఎల్‌ఎల్‌బీ, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌), సుమిత్ర ఆనంద్‌ తనోబా (ఎంఏ తెలుగు, తెలుగు పండిట్‌), కారం రవీందర్‌రెడ్డి (బీకాం, రిటైర్డ్‌ ఉద్యోగి, టీఎన్జీవో పూర్వ అధ్యక్షుడు), అరవెల్లి చంద్రశేఖర్‌రావు (బీఏఎంఎస్‌, ఉస్మానియా, ఆయుర్వేద డాక్టర్‌), ఆర్‌ సత్యనారాయణ (బీఏ, జర్నలిస్ట్‌)ను సీఎం కేసీఆర్‌ నియమించారు.

టీఎస్‌పీఎస్సీ సభ్యుల వివరాలు:

రమావత్‌ ధన్‌సింగ్‌- సభ్యుడు
పేద గిరిజన తండా నుంచి..

రమావత్‌ ధన్‌సింగ్‌ నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన జాత్యానాయక్‌ తండాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా వర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పట్టాపొందారు. పబ్లిక్‌ హెల్త్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈఎన్సీగా ఉన్నత పదవిని అధిరోహించారు. మిషన్‌ భగీరథ నిర్మాణపనులను సమర్థంగా నిర్వర్తించారు. పలు ఫ్లైఓవర్లు బ్రిడ్జిలు, రైల్వే అండర్‌బ్రిడ్జిలు, హైదరాబాద్‌లో రోడ్ల వెడల్పు వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈయన భాగస్వాములు.

యువతకు అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తా

నిబంధనల ప్రకారం పనిచేయటం నాకు అలవాటు. అదే నన్ను ఇంతటి స్థాయికి తెచ్చింది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువతకు ఉన్నత అవకాశాలు కల్పించేందుకు నావంతుగా కృషిచేస్తా.
రమావత్‌ ధన్‌సింగ్‌

ఉద్యోగుల హక్కుల గళం కారం రవీందర్‌రెడ్డి-సభ్యుడు

టీఎన్జీవోల కేంద్రసంఘం అధ్యక్షుడిగా ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ చురుగ్గా వ్వవహరించారు. రవీందర్‌రెడ్డి ప్రస్తుత వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని వేలేరులో జన్మించారు. ఏపీ రేయాన్స్‌ లిమిటెడ్‌లో పనిచేసిన ఆయన టైపిస్ట్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, 2020లో డిప్యూటీ తాసిల్దార్‌గా పదవీ విరమణ పొందారు. టీఎన్జీవోల సంఘం వరంగల్‌ పట్టణశాఖ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా కేంద్రసంఘం ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. వరంగల్‌ జిల్లాలో సకలజనుల సమ్మె సహా రాష్ట్రసాధన ఉద్యమంలో రవీందర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు.

స్వరాష్ట్రం పట్ల ఆపేక్ష

కోట్ల అరుణకుమారి- సభ్యురాలు
కోట్ల అరుణకుమారి ముదిరాజ్‌ వర్గానికి చెందినవారు. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. గతంలో కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండల తాసిల్దార్‌గా, నర్సంపేట ఆర్డీవోగా, వికారాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన ఈమె ప్రస్తుతం ప్రస్తుతం భూభారతి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినందుకు తమకు గౌరవభృతి అవసరంలేదని, స్వరాష్ట్ర పునర్నిర్మాణం కోసం సంతోషంగా సర్వేను నిర్వహిస్తామని నర్సంపేట ఆర్డీవోగా పనిచేస్తున్నప్పుడు అరుణకుమారి సీఎం కేసీఆర్‌ ముందు ప్రకటించి స్వరాష్ట్రం పట్ల ఉన్న ఆపేక్షను చాటుకొన్నారు.

పెండ్లిచూపులూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లోనే..

ఉద్యోగం, వివాహం సహా జీవితమంతా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో ముడిపడి ఉందని టీఎస్‌పీఎస్సీ సభ్యురాలిగా నియమితులైన కోట్ల అరుణకుమారి తెలిపారు. ఏపీపీఎస్సీ 1990 గ్రూప్‌ -2ఏ ద్వారా డిప్యూటీ తాసిల్దార్‌గా ఎంపికైన తన పెండ్లిచూపులు సైతం సర్వీస్‌ కమిషన్‌లోనే జరిగాయని గుర్తుచేసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా, వ్యవసాయశాఖ కమిషనర్‌గా పనిచేసిన జగన్మోహన్‌ను తాను ఏపీపీఎస్సీలోనే చూశానని, ఆ తర్వాతే తమ పెండ్లి నిశ్చయమైందని ఆమె వివరించారు. ‘సీఎం కేసీఆర్‌ తెలివైనవారికి ఏరికోరి అవకాశం ఇస్తున్నారు. నేను కూడా తెలివైనవారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తా’అని చెప్పారు.

నమ్మకాన్నివమ్ముచేయను

సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ముచేయకుండా అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వానికి, సంస్థకు మంచిపేరు తెస్తా. టీఎస్‌పీఎస్సీపై నిరుద్యోగుల నమ్మకాన్ని పెంచేలా నియామక ప్రక్రియను నిర్వహిస్తాం. ఉద్యమకారులతోపాటు, నిజాయితీపరుడైన ఐఏఎస్‌ అధికారిని చైర్మన్‌గా నియమించినందుకు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డికి ధన్యవాదాలు

కారం రవీందర్‌రెడ్డి అన్నదాత బిడ్డ..ప్రొఫెసర్‌ బీ లింగారెడ్డి- సభ్యుడు

ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన ప్రొఫెసర్‌ బండి లింగారెడ్డిది వ్యవసాయ నేపథ్య కుటుంబం. ఉస్మానియా యూనివర్సిటీలో రేడియేషన్‌ ఫిజిక్స్‌లో పట్టా పొందారు. 1996లో చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ప్రస్తుతం ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. విస్తృతస్థాయి రిసెర్చ్‌ ద్వారా ఈయన రాసిన పలు జర్నల్స్‌ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచాయి.

25 ఏండ్ల అనుభవాన్ని ఉపయోగిస్తా

నాకున్న 25 ఏండ్ల అనుభవాన్ని ఉపయోగించి టీఎస్‌పీఎస్సీ నియమకాలు సక్రమంగా జరిగేందుకు తోడ్పాటునందిస్తా. టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా అవకాశం కల్పించిందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
-బీ లింగారెడ్డి

పేదోళ్ల డాక్టర్‌ ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు-సభ్యుడు

డాక్టర్‌ ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందినవారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏఎమ్మెస్‌ చేశారు. ఈయన భార్య కూడా డాక్టర్‌. ముస్తాబాద్‌లో దవాఖాన పెట్టి పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. నవజ్యోతి అనే వాలంటరీ ఆర్గనైజేషన్‌ ద్వారా దుబ్బాక, సిరిసిల్ల ప్రాంతాల్లోని వృద్ధులకు వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. తోటి డాక్టర్ల సహాయంతో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. పేదల డాక్టర్‌గా ఈయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

అంకితభావంతో పనిచేస్తే సరైన గౌరవం

టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా నన్ను నియమించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ పోతే సరైన గౌరవం అవకాశాన్ని సీఎం ఇస్తారనేందుకు ఇదే నిదర్శనం. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తా. నా నియామకానికి సహకరించిన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.

ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు ఉద్యమ పాఠాలు బోధించి..

సుమిత్ర ఆనంద్‌ తనోబా-సభ్యురాలు
సమిత్ర ఆనంద్‌ తనోబా నిబద్ధత కలిగిన తెలంగాణ ఉద్యమకారిణి. తెలుగు భాషా పండితురాలిగా, ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూనే ఉద్యమకారిణిగా తెలంగాణ కోసం పాటుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫోరమ్‌, తెలంగాణ రచయితల వేదికలకు వైస్‌ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ భాషా వేదికకు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి పల్లెలోని ఆరె క్షత్రియ వర్గానికి చెందినవారు. ఉద్యమంలో సుమిత్ర పాత్రను గుర్తించిన కేసీఆర్‌.. ఆమె కుమార్తె నామకరణం రోజు చిన్నమల్లారెడ్డికి వచ్చారు. సుమిత్ర ఆనంద్‌ కూతురికి మహతి అని పేరు పెట్టారు.

ఉద్యమకారిణిగా నన్ను గుర్తించారు

తెలంగాణ మలి దశ ఉద్యమంలో పాల్గొన్న నన్ను గుర్తించి టీఎస్‌పీఎస్సీ సభ్యురాలిగా నియమించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఉద్యమకారులను కేసీఆర్‌ విస్మరించరని చెప్పటానికి నా నియామకమే నిదర్శనం. కేసీఆర్‌ పిలుపు అందుకొని వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఎమ్మెల్సీ కవిత పిలుపుతో బతుకమ్మ ఉత్సవాలు, మహిళాఉద్యమాల్లో పాలు పంచుకొన్నాను.
-సుమిత్ర ఆనంద్‌ తనోబా

ఉద్యమ పాత్రికేయుడుఆర్‌ సత్యనారాయణ-సభ్యుడు

ఆర్‌ సత్యనారాయణ తెలంగాణ జర్నలిస్టుగా, ఉద్యమకారునిగా సుపరిచితుడు. అభిమానులు జర్నలిస్టు సత్తెన్న అని పిలుస్తారు. పద్మశాలి వర్గానికి చెందిన సత్యనారాయణ మెదక్‌ జిల్లా వరిగుంతానికి చెందినవారు. ఈనాడు, ఉదయం, వార్త వంటి దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్‌ పిలుపుతో ఆరేండ్ల ఎమ్మెల్సీ పదవిని ఆరు నెలలకే వదిలేసి పదవి ముఖ్యం కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యమని చాటిచెప్పారు.

నన్ను గుర్తించి పదవి ఇచ్చారు

నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నా నియామకానికి సహకరించిన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తా.
-ఆర్‌. సత్యనారాయణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి

ట్రెండింగ్‌

Advertisement