శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 01:51:00

సీమ ఎత్తిపోతలను ఆపండి

సీమ ఎత్తిపోతలను ఆపండి

  • అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తప్పనిసరి
  • అనుమతి లేకుండా చేపట్టడం చట్టవిరుద్ధం
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం
  • ఏపీ సర్కారు ఫిర్యాదు చేసిన ప్రాజెక్టులను 
  • ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచన
  • రెండు రాష్ర్టాల సీఎంలకు కేంద్రమంత్రి లేఖ
  • ఈ నెలలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం

లేఖలో తెలిపిన మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

రాయలసీమ ఎత్తిపోతల అనే కొత్త ప్రాజెక్టును అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా చేపట్టడం చట్టాన్ని ఉల్లంఘించడమే. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను సమర్పించాలి. బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ పథకం టెండర్లపై ముందుకుపోవద్దు.

          - కేంద్ర మంత్రి షెకావత్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ ఏకపక్షంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే నిలిపివేయాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల అనే కొత్త ప్రాజెక్టును అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా చేపట్టడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టంచేసింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్‌)ను సమర్పించాలని..  బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా రాయలసీమ పథకం టెండర్లపై ముందుకుపోవద్దని ఆదేశించిం ది. అదేవిధంగా ఏపీ ఫిర్యాదుచేసిన ప్రాజెక్టులపై ముం దుకు వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావుకు లేఖలు రాశారు. తెలుగు రాష్ర్టాలు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి కొంతకాలంగా పరస్పరంచేసుకుంటున్న ఫిర్యాదులపై కేంద్రం అపెక్స్‌ కౌన్సి ల్‌ సమావేశాన్ని నిర్వహించాలనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో కేంద్రమంత్రి షెకావత్‌ తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. 

అనుమతులు లేకుండా ముందుకు పోవద్దు

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని గతంలోనే తన మంత్రిత్వశాఖతోపాటు నదీ యాజమాన్య బోర్డులు కూడా లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి షెకావత్‌ తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు పిలిచినట్లు తన దృష్టికి వచ్చిందని స్పష్టంచేశారు. ఈ క్రమంలో డీపీఆర్‌ సమర్పించి, బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ పథకం టెండర్లపై ముందుకు పోవద్దని ఏపీని ఆదేశించారు. అదేవిధంగా తెలంగాణలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదుచేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. వాటికి సంబంధించిన డీపీఆర్‌లు సమర్పించాలని, ఆ ప్రాజెక్టులకు నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్‌ అనుమతులు తీసుకోవాలని తెలంగాణ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పటివరకు ఆ ప్రాజెక్టుల విషయంలో ముందుకుపోవద్దని స్పష్టంచేశారు. అయితే ఈ నెలలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు షెకావత్‌ ఇద్దరు ముఖ్యమంత్రులకు వెల్లడించారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేవు

రెండు రాష్ర్టాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ప్రాజెక్టుల పేర్లను ప్రస్తావించిన కేంద్ర మంత్రి షెకావత్‌ వాటికి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేవని తెలిపారు. ఏపీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ జీవో నం. 203 జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం మే 12న ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎం సీ, గోదావరి లిఫ్టు మూడో దశ, సీతారామ, తుపాకులగూడెం, పెనుగంగపై బరాజ్‌ల నిర్మాణం, రామప్ప, పాకాల చెరువులకు గోదావరిజలాల మళ్లింపుపై ఏపీ ప్రభుత్వం మే 14న ఫిర్యాదు చేసిందని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల అనే కొత్త ప్రాజెక్టును అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా చేపట్టడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని కేంద్రమంత్రి తన లేఖలో తేల్చిచెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2018, జూన్‌లో కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అయితే రోజుకు రెండు టీఎంసీలకు బదులుగా మూడు టీఎంసీల ఎత్తిపోత పనులపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. చట్టం ప్రకారం రెండు రాష్ర్టాలు పరస్పర ఫిర్యాదుల్లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు సమర్పించాలని నదీ యాజమాన్య బోర్డులు కోరినప్పటికీ రెండు రాష్ర్టాలు స్పందించలేదని పేర్కొన్నారు. 

20న అపెక్స్‌ కౌన్సిల్‌!

ఈ నెల 5న తలపెట్టిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి తాము హాజరుకాలేమని ఆరోజున ముందుగా ఖరారైన కార్యక్రమాలున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 20న సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ కోరిన దరిమిలా భేటీని వాయిదా వేశామని తెలిపారు. కృష్ణా, గోదావరిజలాలకు సంబంధించి రెండు వేర్వేరు నదీయాజమాన్య బోర్డులు పర్యవేక్షిస్తున్నప్పటికీ.. కీలకమైన సమస్యల పరిష్కారం అపెక్స్‌ కౌన్సిల్‌లోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పటివరకు 2016, సెప్టెంబర్‌లో ఒక్కసారి మాత్రమే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించామని, పలు కారణాలతో సుదీర్ఘ కాలంగా రెండో సమావేశాన్ని నిర్వహించలేకపోయామని తెలిపారు. కేంద్ర జల్‌శక్తి శాఖ 2018, ఫిబ్రవరి, ఈ ఏడాది జనవరిలో రెండు నదీ యాజమాన్య బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారని కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా అనేక అపరిష్కృత అంశాలు ఉన్నట్లుగా గుర్తించి.. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుకు చాలాకాలంగా కసరత్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సమావేశ ఎజెండా అంశాలు పంపాల్సిందిగా కోరామని, కానీ రెండు రాష్ర్టాల నుంచి స్పందన రాలేదని షెకావత్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు నదీ యాజమాన్య బోర్డుల ప్రతిపాదనల మేరకు నాలుగు ప్రధాన అంశాలతో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు షెకావత్‌ తెలిపారు. logo