అందంతో ఎరవేసి..అందినకాడికి దోపిడీ

- బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు
- మహిళతో సహా నలుగురి అరెస్ట్
జగిత్యాల క్రైం: మగవారితో పరిచయం పెంచుకొని, అందాలను ఎరవేసి నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి, బెదిరించి అందినకాడికి దోచుకుంటున్న ముఠాను జగిత్యాల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. శనివారం ఎస్పీ సింధూశర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. జగిత్యాల పోచమ్మవాడకు చెందిన కూకటి రాజ్‌కుమార్, ధర్మపురి వాసి మామిడి జమున, జగిత్యాల మండలం తిప్పన్నపేటకు చెందిన నలువాల తులసి, సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన కొనపాక దినేశ్ ముఠాగా ఏర్పడ్డారు. దోపిడీ చేయాలనుకొన్న వ్యక్తిని ముందే ఎంచుకుంటారు. ముఠాలోని సభ్యురాలు జమున సదరు వ్యక్తితో మాట కలుపుతుంది. ఆ తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుంటారు. తరచూ ఫోన్లో మాట్లాడి, ఏకాంతంగా కలువాలని ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశానికి తీసుకెళ్తుంది. అక్కడ ముఠాలోని మిగతావారు ఫొటోలు, వీడియోలు తీసి బాధితుడిని బెదిరించి, బంగారం, డబ్బు దోచుకుంటారు. ఇటీవల జగిత్యాల విద్యానగర్‌కు చెంది న ఓ వ్యక్తిని మేడిపల్లి మండలం వల్లంపల్లికి తీసుకెళ్లి నాలుగున్నర తులాల బంగారం, సెల్‌ఫోన్ దోచుకెళ్లడం తో.. బాధితుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఠా వినియోగించిన సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు విచారణ జరిపి నలుగురిని పట్టుకున్నారు. వారి నుంచి 145 గ్రాముల బంగారు నగలు, మూడు సెల్ఫోన్లు, బైక్, రూ.7 వేలు స్వాధీనం చేసుకున్నారు.