బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 01:10:34

కాంగ్రెస్‌ నేతలవి నక్క సంతాపాలు

కాంగ్రెస్‌ నేతలవి నక్క సంతాపాలు

  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి  

తిరుమలగిరి (సాగర్‌) : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలు కుందేలును తిన్న నక్కలు పెట్టుకున్న సంతాప సభలను తలపిస్తున్నాయని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవాచేశారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియా, దేవరకొండలో రైతు అవగాహన సదస్సుల్లో పాల్గొన్నారు.  అంతకుముందు హాలియాలోని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ రావడం ఇక్కడి కాంగ్రెస్‌ నేతలకు ఇష్టం లేదని.. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రజలందరూ పండుగ చేసుకుంటుంటే కాంగ్రెస్‌ నాయకులు దీక్షలు చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని అవమానించారని ఆరోపించారు.  కాంగ్రెస్‌ హయాంలోనే కృష్ణాజలాల దోపిడీ జరిగిందని, సోమశిల, కండలేరు వంటి ప్రాజెక్టులు దివంగత కాంగ్రెస్‌ నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కట్టినవి కాదా? అని ఆయన ప్రశ్నించారు. 350 టీఎంసీల నీళ్లు దోచుకుపోతుంటే దద్దమ్మల్లా కూర్చున్నారని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ పాపం జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలదేనన్నారు. 

దశాబ్దాలుగా మొదటి మేజర్‌ రాజవరానికి సాగు నీళ్లు ఇవ్వలేకపోయారని, సీఎం కేసీఆర్‌ చొరవతో రాజవరానికి నీళ్లు పరుగులు పెట్టింది నిజమా కాదా? కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఏడేండ్లు వరుస కరువు సంభవించినప్పుడు కోదాడ నుంచి హాలియా వరకు సైకిల్‌ యాత్ర చేసింది కేసీఆరా కాదా తేల్చి చెప్పాలన్నారు. 203 జీవోపై జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు తమ వైఖరిని ప్రకటించే సత్తా ఉందా అని నిలదీశారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం తెలంగాణకే పరిమితమని, పార్టీ పేరులోనే తెలంగాణ ఉన్నప్పుడు ఆంధ్రా పార్టీలతో కుమ్మక్కు కావాల్సిన అవసరమేముందన్నారు. ద్వంద్వ విధానాలు టీఆర్‌ఎస్‌ ఇంటా వంటా లేవని 203 జీవోకు టీఆర్‌ఎస్‌ ముమ్మాటికీ వ్యతిరేకమని, కృష్ణా బోర్డుకు లేఖ రాయడంతో పాటు అపెక్స్‌ కమిటీ దృష్టికి తీసుకుపోయామని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, రమావత్‌ రవీంద్రకుమార్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo