శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 18:26:16

జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేద్దాం..

 జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేద్దాం..

సూర్యపేట:  సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రేపటి జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేద్దామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  24 గంటలు కర్ఫ్యూ ను పాటించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమం సాగించిన రీతిలోనే, అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందాం. కరోనా పై ఈ యుద్దంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని ఆయన పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలన్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చు.

రేపు ఉదయం ఆరు గంటల నుంచి  ఎల్లుండి ఆరు గంటల వరకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ 24 గంటలకు అవసరమైన ఆహార పదర్ధాలు, మందులు, ఇతర అత్యవసర వస్తువులు ముందే సమకూర్చుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను రోడ్డు మీదకు రాకుండా   ఈ ఇరవై నాలుగంటలు ఉండి మరో మారు ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలన్నారు. సరైన స్వీయ నియంత్రణ లేకపోడం వల్లే  కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృభించి ప్రజల ప్రాణాలను కబళిస్తోందన్నారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ నిరంతరం కరోనా పరిస్థితులను సమీక్షిస్తూ... అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యంతోనే ఈ వైరస్ ను అరికట్టగలమన్నారు. స్వీయ నియంత్రణతో పాటు సబ్బుతోను, శానిటైజర్స్ తో చేతులు శుభ్రపర్చుకోవాలని సూచించారు. 

 జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనబడితే అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, ప్రభుత్వానికి సమాచారం అందించాలన్నారు. సమాజ సేవ అందరి బాధ్యత , రేపు ఇంటిలో ఉండటమే మనం సమాజానికి అందించే  సేవ అని జగదీష్ రెడ్డి చెప్పారు. విదేశాల నుంచి వచ్చే సమాచారం అందివ్వడం అందరి బాధ్యతఅన్నారు. కరోనా వైరస్ విదేశాల నుంచి వచ్చే వారి నుంచే వస్తోందని....  ఇలా విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు చేసి కరోనా బాధితులను గుర్తించాల్సిన అవసరం ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విదేశాల నుంచి ఎవరు వచ్చినా... వారు స్వచ్ఛంధంగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, సైతం తమ గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల పరిధిలో విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి ప్రభుత్వానికి సమాచారం అందించాలని సూచించారు.


logo