సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 07:30:31

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్‌ :  తెలంగాణలో సోమవారం నుంచి వచ్చే గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, మహబూబాబాద్‌, జనగాం, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, నల్లగొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల, జయశంకర్‌, వరంగల్‌ అర్బన్‌, ములుగు, ఖమ్మం, యాదాద్రి, నల్గొండలో పలు చోట్ల భారీ వర్షాలు కురవగా, హైదరాబాద్‌, కరీంనగర్‌, వనపర్తి, సూర్యాపేట సహా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo