గురువారం 02 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:23:16

దిగుబడి ఇచ్చే ‘తెలంగాణ సోనా’

దిగుబడి ఇచ్చే ‘తెలంగాణ సోనా’

  • జూలైలో నార్లు పోయండి
  • రైతుకు రాబడి వచ్చే కాలమిది
  • జయశంకర్‌ వర్సిటీ సలహా

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: తెలంగాణ సోనా సాగుకు జూలైలో నార్లు పోయాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. ఈ పంటకు వానాకాలం, యాసంగి సీజన్లు అనుకూలమని తెలిపిన వర్సిటీ శాస్త్రవేత్తలు.. వచ్చే నెలలో నార్లు పోసి, 20 రోజుల తర్వాత నాటుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని, రైతన్నకు మంచి రాబడి దక్కుతుందని వెల్లడించారు. యాసంగిలో నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ తొలివారం వరకు నాట్లు వేసుకుంటే పంట బాగా పండుతుందని వివరించారు. యాజమాన్య పద్ధతుల ద్వారా పంట పండించుకోవాలని సూచించారు. వానాకాలంలో ఆలస్యంగా విత్తుకునే రకం కనుక పచ్చిరొట్ట పంటలతో భూసారాన్ని పెంచుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు.

తక్కువ నత్రజనితో కూడా అధిక దిగుబడినిస్తుందని, అన్నం నాణ్యత, రుచిని కలిగి ఉంటుందని వెల్లడించారు. అగ్గితెగులును కూడా సమర్థంగా తట్టుకొనే ఈ పంటకు జూలైలో మాత్రమే నార్లు పోసుకోవాలన్నారు. జూన్‌లో నార్లు పోసుకొంటే కాలపరిమితి పెరుగుతుందని తెలిపారు. ఈ రకాన్ని చౌడు నేలల్లో సాగు చేయరాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.చదరపు మీటరుకు 44 కుదుళ్లు వుండే విధంగా దగ్గర దగ్గరగా నాటుకోవాలని చెప్పారు. కాగా, తెలంగాణ సోనా పంట వేయడం వల్ల ఎకరానికి 28 క్వింటాళ్లు (40 బస్తాలు) వస్తున్నాయి. స్వల్పకాలిక రకం కావడంతో 125 రోజుల్లోనే పంట చేతికి వస్తున్నది. దీనివల్ల రైతులకు మేలు జరుతున్నందున ఈ రకం సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తెలంగాణ సోనాను  10 లక్షల ఎకరాల్లో సాగు చేయించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఈ ధాన్యంలో గ్లూకోజ్‌ శాతం తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఏమాత్రం సంకోచించకుండా తినవచ్చు.


logo