శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:39:33

కరీంనగర్‌కు ఐటీ

కరీంనగర్‌కు ఐటీ

  • నేడు నూతన టవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌
  • కార్యకలాపాలు నిర్వహించనున్న 17 కంపెనీలు 
  • నేటినుంచే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ : మంత్రి గంగుల 
  • కరీంనగర్‌లో నిత్యం మంచినీటి సరఫరాకు శ్రీకారం 

కరీంనగర్‌ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు మంగళవారం ప్రారంభించనున్నారు. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీని విస్తరింపజేయడంలో భాగంగా కరీంనగర్‌ ఐటీ టవర్‌లో 17 కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. కంపెనీలు మంగళవారం నుంచి ఉద్యోగుల నియామక ప్రక్రియను ప్రారంభిస్తాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. దీంతోపాటు కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో నిత్యం మంచినీటి సరఫరాను కూడా కేటీఆర్‌ ప్రారంభిస్తారన్నారు. 

ఐటీ స్వప్నం సాకారం

ఇంతకాలం హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరించాలన్న విధానంలో భాగంగా రూ.34 కోట్ల ఖర్చుతో కరీంనగర్‌లో ఐటీ టవర్‌ను నిర్మించారు. దిగువ మానేరు డ్యాంను ఆనుకొని ఉన్న మూడెకరాల స్థలంలో 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఒక్కో ఫ్లోర్‌లో.. ప్రతి షిఫ్ట్‌కు కనీసం రెండు వందలమంది పనిచేసే అవకాశమున్నది. ఐదంతస్థుల్లో షిఫ్టుకు వెయ్యి మంది పనిచేసేలా వసతులు కల్పించారు. ఈ టవర్‌ ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగించడానికి 17 కంపెనీలు ముందుకొచ్చాయి. దాదాపు మూడు వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒక మల్టీ నేషనల్‌ కంపెనీ కూడా కరీంనగర్‌లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని మంగళవారం ఐటీ టవర్‌ను ప్రారంభించిన తర్వాత ప్రకటిస్తారని తెలిపారు. ఐటీ టవర్‌ను ప్రారంభించిన అనంతరం రూ.183 కోట్లతో సాగుతున్న తీగల వంతెన నిర్మాణ పనులు, రూ.236 కోట్లతో నడుస్తున్న స్మార్ట్‌సిటీ పనులను మంత్రి కేటీఆర్‌ పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రోజూ శుద్ధమైన నీటిసరఫరా కోసం రూ.110 కోట్లతో ఏర్పాటుచేసిన పథకాన్ని కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. 

ఇదొక సువర్ణావకాశం: మంత్రి గంగుల

మంగళవారం మంత్రి కేటీఆర్‌ పర్యటనను పురస్కరించుకొని.. బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగర ప్రజలకు నిత్యం నీటి సరఫరాతోపాటు, టవర్‌ ఏర్పాటుతో ఐటీ నిపుణుల కలను మంత్రి కేటీఆర్‌ సాకారం చేయబోతున్నారని మంత్రి గంగుల సంతోషం వ్యక్తంచేశారు. ఇప్పటికే 17 కంపెనీలు తమ బ్రాంచీలను పెట్టేందుకు ఎంవోయూ చేసుకున్నాయని, హైదరాబాద్‌ తదుపరి అతి పెద్ద భవనం కరీంనగర్‌లో ఏర్పాటు చేయడానికి సహకరించిన మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజతలు తెలిపారు. అంతేకాకుండా నగరంలో నిత్యం మంచినీటి సరఫరాచేసే తొలికార్పొరేషన్‌గా కరీంనగర్‌ సరికొత్త రికార్డు సృష్టించనున్నదని చెప్పారు.


logo