మంగళవారం 19 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 01:45:47

రోహింగ్యాలుంటే కేంద్రం ఏం చేసింది?

రోహింగ్యాలుంటే కేంద్రం ఏం చేసింది?

  • ప్రగతిశీల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
  • ముఖాముఖిలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆరేండ్లుగా కష్టపడి హైదరాబాద్‌ బ్రాండ్‌ వ్యాల్యూను పెంచామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వంపై విశ్వాసంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని ప్రజల ముందుపెట్టామని.. నగర ప్రజలందరూ ఆలోచించి ఓటువేయాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని నిజాంక్లబ్‌లో మంత్రి కేటీఆర్‌తో మ్యాక్స్‌ ప్రాజెక్ట్‌ ఎండీ మీర్‌ నాజిర్‌ అలీఖాన్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఓటుహక్కు శక్తివంతమైన ఆయుధమని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్లో ఉండి ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, సోషల్‌మీడియాకే పరిమితమై కేసీఆర్‌ అంతా బాగానే చేస్తున్నారనడం సబబుకాదని.. బయటకొచ్చి ఓటువేసి దానిని నిరూపించాలని సూచించారు. గ్రేటర్‌లో ఎన్నికలు జరుగుతుంటే.. ఈ ఎన్నికలు బిన్‌లాడెన్‌, బాబర్‌కు దేశభక్తులకు మధ్య పోటీగా బీజేపీ నేతలు చెప్తున్నారని.. బాబర్లు, బిన్‌లాడెన్లు ఏమైనా హైదరాబాద్‌ ఓటర్లా అని ప్రశ్నించారు. నగరంలో రోహింగ్యాలున్నారని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారని.. ఢిల్లీలో ఉన్నది వారి ప్రభుత్వమేనని, రక్షణమంత్రి, ఓటర్‌కార్డిచ్చే మంత్రి, ఆధార్‌కార్డులిచ్చే మంత్రులంతా బీజేపీ వారే కదా? రోహింగ్యాలు వస్తుంటే ఇంతకాలం ఏంచేశారని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మానసిక స్థితి బాగాలేదని, ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదని మండిపడ్డారు.

వాళ్లు పొలిటికల్‌ టూరిస్టులు

గల్లీలో జరిగే ఎన్నికల కోసం బీజేపోళ్లు ఢిల్లీ లీడర్లను దింపుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘మోదీ, అమిత్‌షా, నడ్డా, పక్క రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర     మంత్రులు గుంపులుగా వస్తున్నారట. ఆఖరుకు ఖాళీగా ఉన్నాడని డోనాల్డ్‌ ట్రంప్‌ను కూడా ప్రచారానికి తీసుకొచ్చేట్లు ఉన్నారని’ ఎద్దేవాచేశారు. రాష్టంలో అడుగుపెట్టే కేంద్రమంత్రులంతా తెలంగాణకు బాకీపడ్డందుకు, ట్యాక్సులు కడుతూ దేశాన్ని సాకుతున్నందుకు రాష్ట్ర ప్రజలకు థ్యాంక్స్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపోల్లంతా పొలిటికల్‌ టూరిస్ట్‌లని, టూరిస్ట్‌లు వస్తారు..పోతారు. వాళ్లంతా ఢిల్లీ బాయ్స్‌ అయితే.. మేం గల్లీబాయ్స్‌ అని అభివర్ణించారు. ప్రధాని మోదీ మాట్లాడితే స్కిల్‌ఇండియా, ఫిట్‌ ఇండియా. తాజాగా బేచోఇండియా అంటున్నారని.. ఇవన్నీ పక్కనబెట్టి సోచో ఇండియా అనాలని హితవుపలికారు.

హైదరాబాద్‌లో రోహింగ్యాలున్నారని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఢిల్లీలో ఉన్నది వారి ప్రభుత్వమే. రక్షణమంత్రి, ఓటర్‌కార్డిచ్చే మంత్రి, ఆధార్‌కార్డులిచ్చే మంత్రులంతా బీజేపీ వారే కదా? రోహింగ్యాలు వస్తుంటే ఇంతకాలం ఏంచేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మానసిక స్థితి బాగాలేదు. ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదు.

- మంత్రి కేటీఆర్‌