శనివారం 11 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 01:54:20

నెట్‌లో రైతు వేదికలు

నెట్‌లో రైతు వేదికలు

  • ఫైబర్‌గ్రిడ్‌తో లింక్‌.. డిజిటల్‌ నెట్‌వర్క్‌తో గ్రామాలకు కనెక్టివిటీ
  • విద్య, వైద్యం, సేద్యంలో విప్లవాత్మక మార్పులు
  • టీ-ఫైబర్‌గ్రిడ్‌పై సమీక్షలో ఐటీ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: త్వరలో తెలంగాణలో అందుబాటులోకి రానున్న రైతు వేదికలన్నింటినీ టీ-ఫైబర్‌ ద్వారా అనుసంధానించాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌తో రాష్ర్టానికి బలమైన డిజిటల్‌ నెట్‌వర్క్‌ ఏర్పడబోతున్నదని చెప్పారు. బలమైన డిజిటల్‌ నెట్‌వర్క్‌ అవసరాన్ని ప్రస్తుత కరోనా సంక్షోభం నొక్కిచెప్పిందన్నారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజక్టు పూర్తయితే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (జీ టు జీ), ప్రభుత్వం నుంచి పౌరులు (జీ టు సీ) వరకు అందించే సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. 

గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో అనుసంధానించేలా ఈ ప్రాజెక్టు ఉండబోతున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్త్తయ్యాక ఆన్‌లైన్‌ విద్య, వైద్యం, వ్యవసాయ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోకి కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చి.. డిజిటల్‌ కంటెం ట్‌ ప్రజలకు చేరువవుతుందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. త్వరలో తెలంగాణలో అందుబాటులోకి రానున్న రైతు వేదికలన్నింటినీ టీ-ఫైబర్‌ ద్వారా అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. సొంత గ్రామాల నుంచి రైతు వేదికల ద్వారా రైతులు నేరుగా సీఎం, మంత్రి, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వా రా మాట్లాడుకొనే అవకాశం కలిగేలా ఉండాలన్న సీఎం ఆలోచనమేరకు చర్యలు చేపట్టాలని చెప్పారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఇతర అంశాలపై చర్చించే సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. 

కరోనాపై యుద్ధంలో డిజిటల్‌ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఉపయుక్తంగా మారాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌, ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌, ఈ కామర్స్‌ సేవల అవసరాల నేపథ్యంలో ప్రతి రాష్ట్రం లేదా దేశం బలమైన డిజిటల్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉండాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రస్తుతం లక్షల మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని వినియోగించుకొని పనిచేస్తున్నారని గుర్తుచేశారు. ఐటీ, దాని అనుబంధ రంగాల్లో ఈ పరిస్థితి భవిష్యత్‌లోనూ కొనసాగే అవకాశమున్నదని మంత్రి తెలిపారు. 

ఇందుకోసం ఇబ్బందులు లేని బలమైన బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ అవసరమని, అది ఉన్నప్పుడే వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని అందరు ఉపయోగించుకొనే వీలుంటుందని, ఈ అవసరాలను టీ-ఫైబర్‌ తీర్చనున్నదని చెప్పారు. రాష్ట్రమంతటా బలమైన డిజిటల్‌ నెట్‌వర్క్‌ ద్వారా దేశంలోనే తొలిసారిగా అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండాలన్న సమున్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ఆవశ్యకత మరింత పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డిజిటల్‌ నెట్‌వర్క్‌ స్థితిగతులుపై కూడా మంత్రి కేటీఆర్‌ ఈ సమావేశంలో సమీక్షించారు. 

అందుబాటులో ఉన్న పూర్తి డిజిటల్‌ నెట్‌వర్క్‌, స్టేట్‌ డాటా సెంటర్లను టీ-ఫైబర్‌ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. టీ-ఫైబర్‌ ప్రాజెక్టు పరిధిని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పనులన్నింటిని పదినెలల్లో పూర్తిచేయాలని చెప్పారు. అవసరమైతే రైట్‌టు వే చట్ట సదుపాయాన్ని కల్పించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తోపాటు, టీ ఫైబర్‌ నుంచి సుజయ్‌ కారంపూడి పాల్గొన్నారు.


logo