సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 02:42:59

మాఇంటి ఇలవేల్పు రాజన్న

మాఇంటి ఇలవేల్పు రాజన్న

  • రాష్ట్ర ప్రణాళికాసంఘం  ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌
  • జన్మదినోత్సవం సందర్భంగా  కుటుంబసమేతంగా రాజన్న దర్శనం

వేములవాడ: వేములవాడరాజన్న తమఇంటి ఇలవేల్పు అని తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శిం చుకొన్నట్లు ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన సతీమణి మాధవి, కుమారులు ప్రతీక్‌, ప్రణయ్‌తో కలిసి కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అతిథిగృహం వద్ద మీడియాతో మాట్లాడుతూ తమ ఇంటి ఆరాధ్య దైవమైన రాజన్నను పుట్టిన రోజు సందర్భంగా దర్శించుకుని, ప్రజలందరినీ కరోనా నుంచి కాపాడాలని స్వామి వారిని వేడుకున్నామని తెలిపారు. కరోనా కట్టడికి  ప్రధానిమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. స్వీయ రక్షణతోనే మహమ్మారిని ఆరికట్టవచ్చన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, పార్టీ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, పట్టణ సీఐ వెంకటేశ్‌ తదితరులు వినోద్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  

వినోద్‌కుమార్‌కు హిమాచల్‌ గవర్నర్‌ దత్తాత్రేయ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దత్తాత్రేయ ఫోన్‌లో వినోద్‌ కుమార్‌తో మాట్లాడారు. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులుగా, ప్రజాజీవితంలో న్యాయవాదిగా, రాజకీయ నాయకునిగా అభివృద్ధి,సేవా కార్యక్రమాలు చేపడుతున్న గొప్ప నాయకులని దత్రాత్రేయ  కొనియాడారు.  

మొక్కలు నాటిన వినోద్‌కుమార్‌

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం మంత్రుల అధికార నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఇచ్చిన సవాల్‌ను స్వీకరించిన వినోద్‌కుమార్‌ మొక్కలు నాటారు. వినోద్‌కుమార్‌ తన సతీమణి డాక్టర్‌ మాధవి, కుమారులు డాక్టర్‌ ప్రతీక్‌, ప్రణయ్‌లతో కలిసి మొక్కలు నాటారు.


logo