బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 02:01:09

కొయ్యకాళ్లను కాల్చడం సరికాదు

కొయ్యకాళ్లను కాల్చడం సరికాదు

  • రేపు పర్యావరణ దినోత్సవం
  • పొలాల్లోనే కాలుస్తున్న అధిక రైతులు
  • భూసారం, పర్యావరణానికి ముప్పు
  • కలియదున్నితే చాలు.. కాసుల పంటే!
  • సేంద్రియ ఎరువుగా గడ్డిని వాడొచ్చు
  • తగ్గనున్న 70% ఎరువుల వాడకం

దశాబ్దం క్రితం పోస పోస సేకరించి గడ్డివాముగా పేర్చి.. వేసవిలో పశువులకు మేతగా కూర్చేవారు రైతులు. ఇప్పుడు అదేగడ్డికి నిప్పు పెడుతూ తమ పొలాల్లోని భూసారాన్ని ధ్వంసం చేయడమే కాకుండా పర్యావరణాన్నీ దెబ్బతీస్తున్నారు. కొయ్యకాళ్లను కాల్చివేయడంతో భూమిలోని సూక్ష్మజీవులు నశించి, భూసారం తగ్గిపోతున్నది. పంజాబ్‌, హర్యానాలో రైతులు చేస్తున్న ఇదే పని కాలుష్య రూపంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎంతోమంది ఉసురు తీస్తున్నది. కొయ్యకాళ్లను పొలంలోనే కలియ దున్నినా.. సేంద్రియ ఎరువుగా మార్చినా.. సిరులు కురిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణలో దశాబ్దం క్రితం వరకు ప్రతిఇంట్లో పాడి ఉండేది. ఇప్పుడు గ్రామాల్లో పశుసంపద తగ్గింది. దీంతో రైతుకు గడ్డి అవసరం లేకుండా పోయింది. నాడు వరికోతలకు కూలీలను పెట్టేవారు.. నేడు యంత్రాలను వాడుతున్నారు. కూలీలు వరిని మొదళ్లవరకూ కోసేవారు. కానీ యంత్రాలు సగం వరకు వదిలేస్తున్నాయి. దీంతో కొయ్యకాళ్లు రైతులకు వ్యర్థాలుగా కనిపిస్తుండటంతో వాటికి నిప్పు పెడుతున్నారు. పంట కోసిన తర్వాత మిగిలిన కొయ్యకాళ్లను కంపోస్టుగా మార్చుకోవడంపై అవగాహన లేక రైతులు దానిని దగ్ధం చేస్తున్నారు. భూమిలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు, వానపాములు, క్రిమికీటకాలు రైతులకు స్నేహితులవంటివి. 

అవి పంటకు ఎంతో మేలుచేస్తాయి. కొయ్యకాళ్లకు నిప్పు పెట్టడంతో ఇవ న్నీ దగ్ధమవుతున్నాయి. ఈ మంటల వల్ల నేలలోని నేలలోని సేంద్రియ కర్బనం, కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మారి ఉష్ణోగ్రత పెరుగడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పొగ, ధూళికణాలు గాలిలో కలువడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. పొలాల్లో తిరిగే ముంగిసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోతాయి. సమీపంలో ని పచ్చని చెట్లు కూడా కాలి బూడిదవుతాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఇది సాగుకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. పంజా బ్‌, హర్యానాలో రైతులు ఇదేవిధంగా కొయ్యకాళ్లను కాల్చడం వల్ల పైన ఉన్న దేశరాజధాని నగరం ఢిల్లీలో ఏటా పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాతావరణంలో జీవవాయువు పరిమాణం తగ్గిపోయి ఎంతోమంది వృద్ధులు, చిన్న పిల్లలు ఊపరితిత్తుల వ్యాధులకు గురై మృత్యువాత పడుతున్నారు.

కలియ దున్నినా.. కుప్పపెట్టినా.. బంగారమే

వరి కొయ్యకాళ్లకు నిప్పుపెట్టకుండా కలియ దున్నితే అది కుళ్లి సేంద్రియ పదార్థంగా మారుతుంది. వేసవిలో నేలలో పగుళ్లు రావు. తేమ ఆవిరికావడం తగ్గి తొలకరిలో చినుకులు నేలలోకి ఇంకుతాయి. నేలకోతకు గురికాకుండా ఉంటుంది. టన్ను వరిగడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదలకు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతోపాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు అవసరం. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, ఆ గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి. లేదా పంట అవశేషాల వ్యర్థాలను కంపోస్టుగా మార్చి సేంద్రియ ఎరువుగా కూడా తయారుచేసుకోవచ్చు. వానకాలంలో దున్నేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్‌ ఫాస్పేట్‌వేస్తే వరి కొయ్యలు తొందరగా కుళ్లిపోతాయి. తర్వాత నాటే వరిపంటకు నేల ద్వారా పోషకాలు అందుతాయి.

నిప్పుతో ముప్పు

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లికి చెందిన ఒక రైతు వారంక్రితం నారుమడి దున్నేందుకు కొయ్యకాళ్లకు నిప్పు పెట్టాడు. అవసరం మేర కాలిన తర్వాత మంటలను ఆర్పుదామని ఒడ్డుమీద కూలబడ్డాడు. కానీ, ఒక్కసారిగా గాలిరావడంతో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పడం ఆయన వల్ల కాలేదు. ఆ మంటలు నలువైపులా విస్తరించాయి. అక్కడే కట్టేసిన పశువులకు మంటలు అంటుకున్నాయి. అవి అక్కడికక్కడే చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న కరెంటు మోటార్లు, వైర్లు, గడ్డివాములు కాలిపోయాయి. రైతులకు చాలా నష్టం జరిగింది. ఇదే మండలం ఇప్పల నర్సింగాపూర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. పొలాల దగ్గర నిలిపిన ఓ టిప్పర్‌ కాలి బూడిదయింది. ఇవి మచ్చుకు మాత్రమే. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.

కొయ్యకాళ్లను కాల్చడం సరికాదు

వరి కొయ్యలను కాల్చడం రైతులు మానుకోవాలి. వాటిని కాల్చడం వల్ల రైతులకు మేలుకంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. నిప్పంటించడం వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుంది. భూసారానికి మేలుచేసే క్రిములు, కీటకాలు నశిస్తాయి. దట్టమైన పొగవల్ల ఊపిరితిత్తులకు ప్రమాదం. పర్యావరణానికి కూడా ముప్పు. వరిని మొదళ్ల వరకు కోపించి గడ్డిని సేంద్రియ ఎరువుగా మార్చుకునే అంశంపై దృష్టిపెట్టాలి. తెలంగాణ రైతులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. దానిని అలాగే నిలుపుకోవాలి. 

- బోయినపల్లి వినోద్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

దాదాపు10 శాతం అధిక దిగుబడి 

వరికొయ్యలను నేలలో కలియదున్న డం వల్ల సేంద్రియ కర్బనశాతం పెరిగి దిగుబడి దాదాపు 10 శాతం పెరుగుతుం ది. కొయ్యకాళ్లను భూమిలోనే కలియదున్నేలా వ్యవసాయ ఇంజినీరింగ్‌ శాస్త్రవేత్త లు రోటరీ మల్చర్‌ యంత్రాన్ని తయారుచేశారు. దానిని వాడటం వల్ల కొయ్యకాళ్లు చిన్న ముక్కలుగా నీళ్లలో తేలికగా కలిసిపోతాయి. తర్వాత కేజీవీల్స్‌ ట్రాక్టర్‌తో దున్నినప్పుడు వెంటనే మట్టిలో కలిసిపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడుతాయి.  

- జే విజయ్‌, సేద్య విభాగం శాస్త్రవేత్త (కృషివిజ్ఞాన కేంద్రం జమ్మికుంట) 

సేంద్రియ ఎరువుగా గడ్డి

హార్వెస్టర్‌తో కొందరు వరిని మొదళ్ల వరకు కోపించడం లేదు. మిగిలిన కొయ్యలను కాలపెడుతుండ్రు. కానీ, నేను మొద ళ్ల వరకు కోపిస్తా. అట్ల ఎల్లె వరిగడ్డిని.. అదే మడిలో ఓ మూలకు ఐదు వరుసలుగా కుప్పగా వేస్త. పదిహేనురోజుల్లో రెండు మూడుసార్లు వేస్ట్‌ డీ కంపోసర్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్త. మడిలో నీళ్లు ఉండటం వల్ల కింద నుంచి గడ్డి తడిచి కుళ్లిపోతది. 40 నుంచి 50 రోజుల్లో సేంద్రియ ఎరువుగా మారుతది. ఈ ఎరువుతో దిగుబడి పెరిగి, ఎరువుల వాడకం 70 శాతం తగ్గింది. 

- రూపిరెడ్డి తిరుపతిరెడ్డి, రైతు, కరీంనగర్‌ జిల్లా ,మానకొండూర్‌ మండలం, కొండపల్కల గ్రామం

తాజావార్తలు


logo