e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home Top Slides హైదరాబాద్‌షా

హైదరాబాద్‌షా

హైదరాబాద్‌షా
 • తెలంగాణ ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌ 1.45 లక్షల కోట్లు.. నిరుటికంటే 13% ఎక్కువ
 • రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన రేటు 8 శాతం.. జాతీయ సగటు 2 శాతమే!

ఐటీ, దాని అనుబంధ రంగాల్లో హైదరాబాద్‌ రంగం తనదైన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నది. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటుతో పోల్చితే రెట్టింపు వృద్ధిరేటు నమోదు చేస్తున్నది. కరోనా క్లిష్ట సమయంలోనూ తెలంగాణ దూకుడు తగ్గలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక తేల్చి చెప్పింది. ఇదే సమయంలో కొత్తగా 46వేల మందికి పైగా ఐటీ రంగంలో ఉపాధి పొందారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక స్థితిగతులు తలకిందులవుతున్నా.. తెలంగాణ మాత్రం వాణిజ్య అనుకూల పరిస్థితులను కల్పించడంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2019-20లో రూ.1.28 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే, 2020-21లో రూ.1.45 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. జాతీయ వృద్ధి రేటుతో పోల్చితే ఇది రెట్టింపు కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే 13% అధికం. ఉద్యోగాల కల్పనలోనూ రాష్ట్ర ఐటీ పరిశ్రమ దాదాపు 8% వృద్ధిని నమోదు చేసింది. కొత్తగా 46,489 ఉద్యోగాలను సృష్టించింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ

కొత్త ఆలోచనలకు కార్యరూపం టీ వర్క్స్‌

టీ వర్క్స్‌ భారత దేశంలో రాబోయే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ సెంటర్‌. హైదరాబాద్‌లో 78వేల చదరవు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐపీ ఫెసిలిటేషన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, రాపిడ్‌ ప్రొటోటైపింగ్‌, కంపోనెంట్‌ సోర్సింగ్‌ సేవలు అందిస్తుంది. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా సంస్థలు, స్టార్టప్స్‌, వ్యక్తిగత ఆవిష్కర్తల ఆలోచనలను ప్రొడక్ట్‌ల రూపంలోకి మార్చడం టీవర్క్స్‌ పని. 2020 మార్చిలో టీవర్క్స్‌ 32 రోజుల్లో వెంటిలేటర్‌ను తయారుచేసింది. 3డీ ప్రింటర్లు, లేజర్‌ కట్టర్లతో వెంటిలేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆక్సిజన్‌ కొరత వేధిస్తున్న తరుణంలో తక్కువ ధరలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను రూపొందించింది. అంతేకాకుండా మందులు డెలివరీ చేసే ఏఎంఆర్‌టీ-25 (డ్రోన్‌), మెడికల్‌ డ్రోన్‌ పేలోడ్‌, ఎలక్ట్రానిక్స్‌ వర్క్‌ బెంచ్‌ తదితరల పరికరాలను తయారు చేసింది.

సంక్షోభంలోనూ ప్రపంచ స్థాయి పెట్టుబడులు

 • కరోనా కష్టకాలంలోనూ ప్రపంచస్థాయి పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. అమెజాన్‌ డాటా సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.20,761 కోట్లతో ఫ్యాబ్‌సిటీ, ఫార్మాసిటీ, చందన్‌వల్లిలో మూడు డాటా సెంటర్లను ఏర్పాటుచేస్తున్నది.
 • నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో స్మార్ట్‌ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది.
 • సేల్స్‌ఫోర్స్‌ సంస్థ హైదరాబాద్‌కు విస్తరిస్తున్నది. వచ్చే ఐదేండ్లలో రూ.1,119 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. 2,500 ఉద్యోగాల కల్పన జరుగనున్నది.
 • గోల్డ్‌మెన్‌ సాక్స్‌ హైదరాబాద్‌కు విస్తరించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ప్రాథమికంగా 500 ఉద్యోగాలు రానున్నాయి.
 • ఆటోమొబైల్‌ రంగంలో ప్రఖ్యాతి గాంచిన ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌సీఎ) సంస్థ రూ.1100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. ఫియట్‌ సంస్థ ఉత్తర అమెరికా వెలుపల స్థాపిస్తున్న తొలి ఫెసిలిటీ సెంటర్‌ ఇదే కావడం ప్రత్యేకం. దీని ద్వారా మొదటి ఏడాది వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
 • ఒప్పో సంస్థ తన తొలి 5జి ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నది.
 • అమెరికాకు చెందిన బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థ హైదరాబాద్‌లో రూ.1000 కోట్ల పెట్టుబడితో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నది. అమెరికాకు వెలుపల ఏర్పాటు చేస్తున్న ఈ తొలి కేంద్రం ద్వారా 300 మందికి పైగా ఉపాధి పొందనున్నారు.

అత్యాధునిక టెక్నాలజీల వినియోగం

సాంకేతికతలో వస్తున్న నూతన మార్పులను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ దేశంలోనే ముందువరుసలో ఉన్నది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బ్లాక్‌ చెయిన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డ్రోన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌, క్లౌడ్‌, బిగ్‌ డాటా, స్పేస్‌ టెక్నాలజీ, ఐవోటీ, అడిటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌లను అందిపుచ్చుకునేలా కార్యక్రమాలు చేపట్టింది. 2020ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇయర్‌గా ప్రకటించడడంతోపాటు, ఈ టెక్నాలజీ ఆధారంగా వ్యవసాయ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా ఆవిష్కర్తలను ప్రోత్సహించింది. విద్యార్థుల్లో ఎమర్జింగ్‌ టెక్నాలజీల గురించి అవగాహన కల్పించడం, శిక్షణలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టింది.

సులభంగా ఎలక్ట్రానిక్‌ సేవలు

సాంకేతిక ఆధారిత ప్రభుత్వ సేవలను అందించడంలో పారదర్శకతను, బాధ్యతను, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ (ఈఎస్డీ) ప్రధాన వేదికగా మారింది. మీసేవ, టీ యాప్‌ ఫోలియో, టీ-వ్యాలెట్‌ ద్వారా తెలంగాణ ప్రజలకు నాణ్యమైన సేవలందుతున్నాయి. వందకు పైగా ఏజెన్సీల భాగస్వామ్యంతో ఈఎస్డీ అందిస్తున్నది. మొత్తం 4,500కు పైగా మీ సేవా సెంటర్లు, మీ సేవా పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా సేవలందుతున్నాయి. ఏడాదికి రూ.4,500 కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతుండగా, ప్రతిరోజు లక్ష నుంచి లక్షన్నర మంది పౌరులు సేవలు పొందుతున్నారు. లావాదేవీలలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్‌షా

తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌

హైదరాబాద్‌షా

ప్రభుత్వ కార్పొరేషన్‌ అయిన తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) సంస్థ కంప్యూటర్‌ ఆధారిత సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు, కంప్యూటర్‌ పరికరాల సేకరణకు, ఇతర ఐటీ సేవల వినియోగంపై పనిచేస్తున్నది. ప్రభుత్వ ఐటీ ఆధారిత కార్యకలాపాలను టీఎస్‌టీఎస్‌ నిర్వహిస్తున్నది. ధరణి పోర్టల్‌ అభివృద్ధిలో నోడల్‌ ఏజెన్సీగా ఉంటూ, అవసరమైన సాంకేతిక మద్దతును అందిస్తున్నది. గత నెల 22 వరకు ధరణి పోర్టల్‌ ద్వారా 5 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగగా, రూ.555 కోట్ల చెల్లింపులు జరిగాయి.

తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌

రాష్ట్రంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్‌ ఇన్నొవేషన్‌ సెల్‌ కృషి చేస్తున్నది. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నది. ఇందులో భాగంగా 25,000 మంది విద్యార్థులు, 5092 మంది ప్రభుత్వ టీచర్లను అనుసంధానం చేసి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నది. కమ్యూనికేషన్‌ ఫర్‌ ఇన్నొవేషన్‌ వర్క్‌షాప్‌, రిజిజ్‌-హైదరాబాద్‌ స్టార్టప్స్‌, ఇంటింటా ఎంటర్‌ప్రెన్యూర్‌, సోషల ఇంపాక్ట్‌ బూట్‌క్యాంప్‌ 2020 వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

సోషల్‌ మీడియాలో తెలంగాణ సీఎంవో టాప్‌

హైదరాబాద్‌షా

దేశంలోనే తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌ హ్యాండిల్‌కు విశేష ఆదరణ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి వెయ్యి మందిలో ఫాలోవర్స్‌ ప్రాతిపదికన చూస్తే తెలంగాణ సీఎంవో తర్వాత రెండు, మూడు స్థానాల్లో హర్యానా, మహారాష్ట్ర ఉన్నాయి. ఇదే లెక్కన తెలంగాణ సీఎంవో ఫేస్‌బుక్‌ మూడో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని డిజిటల్‌ మీడియా వింగ్‌ వెల్లడించింది. పౌరులకు సరైన సమాచారం అందించడంలో, అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్లను నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నది. 2020-21లో తెలంగాణ సీఎంవో, మినిస్టర్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లు కలిపితే 20 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. కరోనా సమయంలో కొవిడ్‌-19 పోర్టల్‌, ఫ్యాక్ట్‌చెక్‌ పోర్టల్‌, కోవిడ్‌-19 వాట్సప్‌ చాట్‌బోట్‌లను విజయవంతంగా నిర్వహిస్తున్నది.

విద్య, నిపుణ చానెళ్ల సాప్ట్‌నెట్‌

హైదరాబాద్‌షా

టీశాట్‌, సాఫ్ట్‌నెట్‌.. విద్య, ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయం తదితర అంశాలపై ప్రత్యేక యాప్‌ ద్వారా విద్య, నిపుణ చానెళ్లను నడపుతున్నది. కొవిడ్‌ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖతో కలిసి మూడో తరగతి నుంచి పదోతరగతి వరకు రోజుకు 8 గంటలు డిజిటల్‌ తరగతులను నిర్వహించింది. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో ప్రసారాలు చేసింది. ఆరు సబ్జెక్టులపై 2,350 వీడియోలను అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్‌ విద్యార్థుల కోసం 11 ఎపిసోడ్‌ల డిజిటల్‌ పాఠాలను ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ప్రసారం చేసింది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ఎన్నో పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్‌షా

జీవితాల్లో వెలుగులు నింపిన టాస్క్‌

తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెజ్డ్‌ (టాస్క్‌) రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపే ఉద్దేశంతో ఏర్పటైంది. ఇప్పటివరకు వేల మంది యువకులకు విజ్ఞాన, నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి కల్పించింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లర్నింగ్‌, డాటా సైన్స్‌, బ్లాక్‌ ఛైన్‌ సాంకేతికతపై 25వేల మంది విద్యార్థులకు, 2300 మంది బోధకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. కెరియర్‌ టాక్‌ సిరీస్‌ పేరుతో 20కిపైగా వెబినార్‌లు నిర్వహించింది. టీహబ్‌, వీహబ్‌, రిచ్‌, టీఎస్‌ఐసీ, టీ వర్క్స్‌, టీశాట్‌, ఐఐటీ, ఐఎస్‌బీ, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లతోపాటు జీఎఎంఈ, టీఐటీ హైదరాబాద్‌, కాకతీయ స్యాండ్‌బాక్స్‌ తదితర సంస్థలతో కలిసి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనపై పనిచేస్తున్నది.

ఇప్పటి వరకు ఇలా..

 • టాస్క్‌లో రిజిస్టరైన కాలేజీలు: 669
 • కొత్తగా రిజిస్టరైన విద్యార్థులు : 30వేలు
 • టాస్క్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందిన విద్యార్థులు : 1,33,150
 • టాస్క్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందిన బోధకులు: 8,335
 • టాస్క్‌ శిక్షణ ఇచ్చిన బోధకుల ద్వారా నైపుణ్యాబివృద్ధిలో శిక్షణ పొందిన విద్యార్థులు : 2,25,000

ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్‌

హైదరాబాద్‌షా

ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్‌తోపాటు డిజిటల్‌ సర్వీసులు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం టీఫైబర్‌ ప్రాజెక్టును చేపట్టింది. ఇండ్లతోపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలకు ఫైబర్‌నెట్‌ సదుపాయం కల్పించనుంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు 141 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్లకు సైతం నెట్‌ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నది.

టీ ఫైబర్‌ కవర్‌ చేయాల్సిన లక్ష్యం..

 • పది జోన్లు, 33 జిల్లాలు
 • 589 మండలాలు
 • 12,751 గ్రామాలు
 • 141 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌, జీహెచ్‌ఎంసీ
 • 83.58 లక్షల ఇండ్లు, 3.5 కోట్ల జనాభా
 • 30వేల పైచిలుకు ప్రభుత్వ కార్యాలయాలు

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ వింగ్‌

రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఐటీ పరమైన మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్‌, భద్రతపరమైన సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ వింగ్‌ ఏర్పాటైంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర డాటా సెంటర్‌ (టీఎస్‌డీసీ) కొవిడ్‌-19 సమయంలోనూ ప్రజలకు అంతరాయం లేకుండా సేవలు అందిస్తున్నది. అలాగే తెలంగాణ ఈ-మెయిల్‌ సర్వీసెస్‌ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలకు ఇప్పటివరకు 53 వేల ఈ-మెయిల్‌ అకౌంట్‌లు అందించింది. ఈ-ఆఫీస్‌ అమలు కోసం 32 వేల ఈ-మెయిల్‌ అకౌంట్‌లను అందించింది. ఇవే కాకుండా టీ స్వాన్‌, టీఎస్‌వోసీ సేవలను అందిస్తున్నది.

టీ-సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌

ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంస్థల ద్వారా సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు టీ-సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ పనిచేస్తున్నది. ఇప్పటివరకు రూ.10.20 కోట్ల రిలీఫ్‌ మెటీరియల్‌ పొందగా, 25 లక్షల మంది లబ్ధిపొందారు. 22 లక్షల రేషన్‌ కిట్లు, 20 లక్షల ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, 8 లక్షల మందికి భోజనం అందించారు.

కష్టకాలంలో స్టార్టప్‌లకు భరోసా

హైదరాబాద్‌షా

గత ఐదేండ్లలో సాధారణ ఇంక్యూబేటర్‌ నుంచి ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌గా అభివృద్ధి చెందిన టీహబ్‌ కొత్త ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలకు ఊతమిచ్చే దిశగా ఎదిగింది. రానున్న రోజుల్లో కొత్త సవాళ్లను ఎదుర్కొని భవిష్యత్తులో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నది. కరోనా మహమ్మారి సమయంలో స్టార్టప్‌ కంపెనీలకు బాసటగా నిలిచింది. ప్రత్యేక వెబినార్‌ సిరీస్‌లు, మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వ్యాపార నిర్వహణ, వ్యక్తిగత రక్షణ, ఉద్యోగుల సంరక్షణ తదితర అంశాల్లో స్టార్టప్‌లకు అండగా నిలించింది. ఫస్ట్‌ లాక్‌డౌన్‌ సమయంలో 25కు మించి వెబ్‌నార్‌లు నిర్వహించి, 4000వేల మందిలో భరోసా నింపింది.

వీ హబ్‌తో మహిళా పారిశ్రామికవేత్తలు

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో వీహబ్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వ్యాపార మెళకువలు నేర్పడం, సాంకేతికత అందించడం, ఆర్థికంగా మద్దతు లభించేలా చూడటం వంటి సహకారం అందిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఫిజికల్‌ అండ్‌ వర్చువల్‌ మోడ్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 13% స్టార్టప్స్‌ ఇంక్యుబేషన్‌ స్థాయికి చేరుకోగా, కోహర్ట్‌-2లోని 28% స్టార్టప్స్‌ ఒక దశ నుంచి మరో దశకు చేరుకున్నాయి. 34% ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆన్‌లైన్‌, రిటైల్‌ మార్కెట్‌ అనుసంధానం లభించింది. 67% ఆంత్రప్రెన్యూర్స్‌ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా రూ.53.2 కోట్ల ఫండ్‌ వీహబ్‌ ద్వారా సమకూరింది. మొత్తం 4,527 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇప్పటివరకు 16 స్టార్టప్‌ కార్యక్రమాలు నిర్వహించగా, 327 స్టార్టప్స్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

హైదరాబాద్‌షా
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హైదరాబాద్‌షా

ట్రెండింగ్‌

Advertisement