గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 14:15:32

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ : కేటీఆర్‌

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ : కేటీఆర్‌

కరీంనగర్‌ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం ప్రారంభించారు. ఈ ఐటీ హబ్‌ను రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఐటీ టవర్‌లో నెలకొల్పిన పలు కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికైనవారికి కేటీఆర్ నియామక పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన రోజుల్లో ఐటీ అభివృద్ధిపై పలు అనుమానాలు ఉండేవని, ఆరోజుల్లో ఐటీ ఎగుమతులు చాలా తక్కువగా ఉండేవన్నారు. ఐదేండ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. 

కరీంనగర్‌లో టాస్క్‌, టీహబ్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం.పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని వెల్లడించారు. పోటీ ప్రపంచంలో స్కిల్‌, అప్‌స్కిల్‌, రీస్కిల్‌ను పెంపొందించుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీని విస్తరింపజేస్తున్నామని తెలిపారు. ఐటీ నిర్వచనం క్రమంగా మారుతున్నదని, ప్రస్తుతం ఐటీ అంటే ఇంటెలిజెంట్‌ టెక్నాలజీగా మారిందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మాస్కులు వేసుకున్నదీ? లేనిదీ తెలుస్తున్నదని, కొవిడ్ నియంత్రణలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. పట్టణాలు, గ్రామీణ యువత ఐటీలో సత్తా చూపుతున్నారని, స్థానిక స్టార్టప్‌లను అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. 



logo