ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 01:50:45

లిఫ్ట్‌ పై నుంచి ఎక్స్‌ప్రెస్‌ హైవేనా?

లిఫ్ట్‌ పై నుంచి ఎక్స్‌ప్రెస్‌ హైవేనా?

  • ముంబై-చెన్నై హైవే కోసం కేంద్రం సర్వే
  • శ్రీగురురాఘవేంద్రస్వామి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సెంటర్‌గా మార్కింగ్‌
  • ప్రమాదంలో 700 ఎకరాల ఆయకట్టు
  • ఆందోళనలో జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల రైతులు

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జోగుళాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల లిఫ్ట్‌ ద్వారా సీఎం కేసీఆర్‌ 55 వేల ఎకరాలకు సాగునీరందిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరిట దానిని ప్రశ్నార్థకంలో పడేస్తున్నది. కేంద్రం తెలంగాణ మీదుగా ముంబై నుంచి చెన్నై వరకు నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం 700 ఎకరాలకు సాగునీరందించే లిఫ్ట్‌, పంపుహౌజ్‌, పైపులైన్‌ను రోడ్డు సెంటర్‌పాయింట్‌గా సర్వేచేసి జెండాలు పాతింది. తుంగభద్ర నదినుంచి రెండుదశల్లో లిఫ్ట్‌చేసి జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని 700 ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. ఇందుకోసం మండలంలోని బుడమొర్సు సమీపంలో శ్రీ గురురాఘవేంద్రస్వామి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఏర్పాటుచేశారు. నది నుంచి మొదటిదశలో రెండు హైస్పీడ్‌ 30 హెచ్‌పీ మోటర్లతో పంపింగ్‌ చేసిన నీటిని రెండోదశలో శ్రీగురురాఘవేంద్ర లిఫ్ట్‌లో ఏర్పాటుచేసిన 30 హెచ్‌పీ లోస్పీడ్‌ మోటర్లతో పంపింగ్‌ చేసి ఆయకట్టుకు అందిస్తున్నారు. ప్రస్తుతం దీనికింద రెండుపంటలకు నీరందుతున్నది. కేంద్రం చేపట్టిన సర్వేలో భాగంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ పంప్‌హౌజ్‌తోపాటు, మొత్తం పైప్‌లైన్‌, డెలివరీ మీదుగానే వెళుతున్నది. సర్వే అధికారులు సరిగ్గా లిఫ్ట్‌ను కేంద్రంగా చేసుకుని ఇరువైపులా 40 మీటర్ల చొప్పున జెండాలు పాతారు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొద్దిగా దక్షిణం వైపు జరిపి సర్వేచేస్తే లిఫ్ట్‌, పైప్‌లైన్‌ అంతా కాపాడేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తెలంగాణ సర్కారు జోక్యం చేసుకుని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అలైన్‌మెంట్‌ను మార్చేలా చూడాలని వేడుకుంటున్నారు.

బీజేపీ సర్కారుకు మా బాధ పట్టదా?

ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టుకు సాగునీరందక రైతాంగం పడుతున్న బాధలు గమనించిన సీఎం కేసీఆర్‌ తుమ్మిళ్ల లిఫ్టు ఇరిగేషన్‌ పథకా న్ని ఏర్పాటుచేశారు. రైతులే సొం తంగా నిర్వహించుకుంటున్న రాఘవేంద్ర లిఫ్ట్‌ ను కేంద్రం ఎక్స్‌ప్రెస్‌హైవే పేరిట నాశ నం చేసేందుకు సిద్ధమవ్వడం అన్యా యం.    

-శ్రీనివాసులు, బుడమొర్సు, వడ్డేపల్లి మండలం, జోగుళాంబ గద్వాల 

మా గుండెకాయ పోయినట్టే..

గురురాఘవేంద్రస్వామి లిఫ్ట్‌ ద్వారా 700 ఎకరాలు సాగుచేసుకుంటున్నాం. రైతుల గుండెకాయ లాంటి లిఫ్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రోడ్డు నిర్మాణంలో నామరూపాలు లేకుండా పోయేలా సర్వే చేసి జెండాలు పాతారు. కేంద్రం రైతుల నడ్డి విరిచేందుకు కంకణం కట్టుకుందని ఈ నిర్ణయమే చెప్తున్నది. 

- బింగి వెంకట్రాముడు, బుడమొర్సు గ్రామం

అలైన్‌మెంట్‌ మార్పు మా పరిధిలో లేదు

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు సంబంధించి సర్వే కొనసాగుతున్నది. శ్రీగురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ జరుపుతున్నారు. అలైన్‌మెంట్‌ మార్పునకు సంబంధించిన అంశం మా పరిధిలో లేదు. 

- శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌, జోగుళాంబ గద్వాల