శనివారం 30 మే 2020
Telangana - May 19, 2020 , 01:53:56

ఆ కేసును విచారించం

ఆ కేసును విచారించం

  • పీజీ మెడికల్‌ ఫీజు అంశాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఎదుట ఉంచాలి
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులివ్వడం లేదు
  • జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు ధర్మాసనం వెల్లడి
  • టీఏఎఫ్‌ఆర్సీ చైర్మన్‌వి తప్పుడు ఆరోపణలని వ్యాఖ్య

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనార్టీ, నాన్‌ మైనార్టీ ప్రొఫెషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజుల ఖరారు అంశంపై విచారణ నుంచి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు ధర్మాసనం తప్పుకున్నది. ఈ కేసును తాము విచారించబోమని, ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు చీఫ్‌ జస్టిస్‌ ఎదుట ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) చైర్మన్‌ జస్టిస్‌ పీ స్వరూప్‌రెడ్డి తమపై (జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావుపై) ఆరోపణలు చేస్తూ దాఖలుచేసిన మెమో పూర్తిగా తప్పని సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో ధర్మాసనం స్పష్టంచేసింది. పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను టీఏఎఫ్‌ఆర్సీ ఇటీవల ఖరారుచేయగా.. నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. దీన్ని సవాల్‌చేస్తూ 120 మంది మెడికల్‌ పీజీ అభ్యర్థులు హైకోర్టులో కేసు దాఖలుచేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు ఈ కేసును వినరాదని, ఆయన కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి, టీఏఎఫ్‌ఆర్సీకి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారని పేర్కొంటూ టీఏఎఫ్‌ఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ పీ స్వరూప్‌రెడ్డి హైకోర్టులో మెమో దాఖలుచేశారు. ఈ మెమోకు సంబంధించి సోమవారం ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘ఇది అత్యవసర కేసు అని చీఫ్‌ జస్టిస్‌ పరిపాలనా ఆదేశాలిచ్చారు.

14వ తేదీన ఒకే డివిజన్‌ బెంచ్‌ ఉండటంతో రోస్టర్‌ ప్రకారం ఈ కేసు మా ఎదుటకు వచ్చింది. ఉద్దేశపూర్వకంగా మేం విచారణకు స్వీకరించలేదు. 2017లో ఇంజినీరింగ్‌ ఫీజుల కేసులో మేం ఇచ్చిన తీర్పునకు టీఏఎఫ్‌ఆర్సీ చైర్మన్‌ దురుద్దేశాలు ఆపాదించారు. తర్వాత మా తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమర్థించిందన్న విషయాన్ని గుర్తించాలి. గతంలో నాలుగున్నరేండ్లకు మెడికల్‌ ఫీజులు వసూలు చేయాలన్న కేసులో టీఏఎఫ్‌ఆర్సీ సభ్య కార్యదర్శిని కోర్టులో నిలబెట్టారన్న ఆరోపణల్లో వాస్తవంలేదు. కోర్టులో ఉండాలని మేం ఆదేశించలేదు. గత తీర్పుల్లో మాకు దురుద్దేశాలు ఆపాదించడం సరైందికాదు. ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా దాఖలైన ధిక్కరణ కేసుల్లో 86 శాతం డిస్మిస్‌ చేశాం. 14 శాతం కేసుల్లోనే అధికారులకు వ్యతిరేకంగా తీర్పులొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నామన్న ఆరోపణ వాస్తవవిరుద్ధం. మేం (జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు) తెలంగాణలోనే పుట్టి, ఇక్కడే చదివిన విషయం టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌కు బాగా తెలుసు. ప్రభుత్వానికిగానీ, వ్యక్తులకుగానీ ఎవరికీ అనుకూలంగా వ్యవహరించలేదు. రాష్ట్ర ప్రజలకు, న్యాయవాదులకు మాపై విశ్వాసం ఉన్నదని నమ్ముతున్నాం. మెమోలో చైర్మన్‌ ఉపయోగించిన పదాలు ఒక రిటైర్డ్‌ జడ్జి స్థాయికి తగినవికాదు. ఆయనపై ఎలాంటి ధిక్కరణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశం మాకు లేదు’ అని ధర్మాసనం పేర్కొన్నది.


logo