శనివారం 11 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 00:38:00

జిల్లా దవాఖానల్లోనే ఐసొలేషన్‌

జిల్లా దవాఖానల్లోనే ఐసొలేషన్‌

  • అవసరమైతేనే హైదరాబాద్‌కు పంపండి: మంత్రి ఈటల
  • వైద్యులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాకు ఐసొలేషన్‌ సేవలను జిల్లా దవాఖానల్లోనే చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినా వైరస్‌ లక్షణాలు లేనివారికి ఇంటి వద్దే చికిత్స అందించేలా ఆయా జిల్లాల పరిధిలో ఏర్పాట్లుచేయాలని సూచించారు. కరోనా బాధితు ల్లో తీవ్రత ఉన్నవారినే గాంధీ దవాఖానకు పంపాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వైద్యాధికారులు, దవాఖాన సూపరింటెండెంట్లు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లతో మంత్రి బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీల పరిధిలోని వైద్యులు, సిబ్బంది.. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పారు. జిల్లాలవారీగా వైద్యవిభాగాలు సీజనల్‌ వ్యాధులపై దృష్టిపెట్టాలని, అన్ని ప్రభుత్వ దవాఖానల్లో జ్వరపీడితులకు ఒక ఓపీ, సాధారణ రోగుల కోసం మరో ఓపీ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరూ సెలవులు తీసుకోవద్దన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చినవారి ద్వారా కరోనా వ్యా ప్తి చెందిందని, త్వరలోనే అదుపులోకి తెచ్చేందుకు వైద్యవిభాగాలు కృషిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి ఎక్కడా జరుగలేదని స్పష్టంచేశారు. 

జూనియర్‌ డాక్టర్లతో సమావేశమైన మంత్రి ఈటల

కరోనా వ్యాధిగ్రస్తులను తల్లిదండ్రుల్లా ఆదరిస్తూ చికిత్స  అందిస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని, కఠినంగా చర్యలు తీసుకొంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం మంత్రి స్వయంగా గాంధీ హాస్పిటల్‌కు వెళ్లి జూనియర్‌ డాక్టర్లతో పలు అంశాలను చర్చించారు. వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జూడాలు చేపట్టిన ఆందోళనను మంత్రి సూచనమేరకు విరమించారు. గాంధీ దవాఖానను డీ సెంట్రలైజేషన్‌ చేయాలన్న ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. జూనియర్‌ వైద్యుల కమిటీతో ప్రతివారం గాంధీలోనే సమావేశం అవుతానని,  విధుల్లో ఉన్న వైద్యులకు వసతి, సౌకర్యం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. 


logo