శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 18:26:04

తెలంగాణ సోన‌-మార్కెటింగ్ వ్యూహంపై ఐఎస్‌బీ నివేదిక విడుద‌ల‌

తెలంగాణ సోన‌-మార్కెటింగ్ వ్యూహంపై ఐఎస్‌బీ నివేదిక విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణ సోన - మార్కెటింగ్ వ్యూహంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) రూపొందించిన నివేదికను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. మంత్రుల నివాస స‌ముదాయంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, సహకార కమిషనర్ వీరబ్రహ్మయ్య, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావు, ఐఎస్‌బీ ప్రతినిధులు ప్రొఫెసర్ శేషాద్రి, ప్రొఫెసర్ మధు విశ్వనాధన్, శ్రీధర్ భాగవతుల పాల్గొన్నారు. 

ఈ ఆలోచ‌న ఇంతవ‌ర‌కు ఎవ‌రూ చేయ‌లేదు..

తెలంగాణ పంట ఉత్పత్తుల గొప్పతనం వినియోగదారులు, ప్రజలకు తెలియాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు ముందుకు సాగుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పరంగా రైతుల ఉత్పత్తులను బ్రాండింగ్ చేయాలన్న ఆలోచన ఇంత వరకు ఎవరూ చేయలేదని.. ఇది తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయమ‌ని పేర్కొన్నారు.  తెలంగాణ రైతు ఉత్పత్తులకు విస్తృత ప్రచారం క‌ల్పించే ల‌క్ష్యంతో ఆరునెలలుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అడుగులు వేస్తోంద‌న్నారు. తెలంగాణ రైతు ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరేలా అదేవిధంగా రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. 

అంత‌ర్జాతీయ‌స్థాయికి తెలంగాణ సోన ఖ్యాతి..

తెలంగాణ సోన ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని మంత్రి తెలిపారు. తెలంగాణ సోన ఆరోగ్యకరమైనది. రుచికరమైనది. అధిక ప్రొటీన్లు (8 శాతం), అధికశాతం పీచు (3 శాతం), తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (51.5 శాతం) కలిగిఉంది. తక్కువ నీటి వినియోగం. ఇతర సన్న రకాలకన్నా 30 రోజులు ముందుగా కోతకు వ‌స్తుంది. యాసంగి, వానాకాలంలో సాగుకు అనుకూలం. తెగుళ్లను తట్టుకునే వంగడం అన్నారు. తెలంగాణ సోన గతంలో 4 లక్షల ఎకరాలలో సాగుచేయగా, రాష్ట్రంలో ఈ ఏడాది 10 లక్షల ఎకరాలకు పెరిగింద‌న్నారు. కేవలం 50 శాతం మంది వినియోగదారులకు మాత్రమే దీనిపై అవగాహన ఉంద‌న్నారు. దీనిని మరింత మందికి తెలియజేస్తే మరింత ఆదరణ లభిస్తుందన్నారు. బియ్యం వ్యాపారులు, కిరాణా వర్తకులు దీని గొప్పతనం వినియోగదారులకు తెలియజెప్పేలా వారి పాత్రను నిర్వర్తించాలని మంత్రి పేర్కొన్నారు.