గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 19:12:00

పాత పాలమూరు పచ్చబడాలన్నదే త‌మ‌ ప్రయత్నం : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

పాత పాలమూరు పచ్చబడాలన్నదే త‌మ‌ ప్రయత్నం : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

వ‌న‌ప‌ర్తి : పాత పాలమూరు జిల్లా పచ్చబడాలన్నదే త‌మ‌ ప్రయత్నమ‌ని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల బాగుకోసం ఎవ‌రికాళ్ల‌యినా మొక్కుతాన‌న్నారు. నూతన రెవిన్యూ చట్టానికి మద్దతుగా వనపర్తిలో నేడు రైతు అభినంద‌న సభ జ‌రిగింది. ఈ సభకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్లు లోక్ నాథ్ రెడ్డి, సరితా తిరుపతయ్య యాదవ్, మాజీ ఎంపీ మందా జగన్నాధం, తదితరులు స‌భ‌కు హాజ‌ర‌య్యారు. పెబ్బేరు నుండి వనపర్తి వరకు మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులతో పాటు అభినందన సభకు హాజర‌య్యారు. 


స‌భ‌లో పాల్గొన్న మంత్రి నిరంజ‌న్‌రెడ్డి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... రైతులు లేనిదే రాజ్యం లేదు.. సేద్యం లేనిదే జీవులు లేవ‌న్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో పల్లెలకు కొత్తసొగసు వ‌చ్చింద‌న్నారు. నూతన రెవెన్యూ చట్టంతో రైతాంగం కష్టాలకు కాలంచెల్లిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా, ఇతర రాష్ట్రాలకు అనుసరణీయంగా మారాయన్నారు. కష్టపడే తత్వం ఉంటే తప్పక ఫలితం ఉంటుందన్నారు. ప్ర‌జ‌ల‌ అభిమానమే త‌మ‌ని నడిపిస్తుంద‌న్నారు. ఎవరూ ఎల్లకాలం పదవుల్లో ఉండరు. ఉన్న సమయంలో ప్రజలకు ఎంత ఉప‌యోగం పనిచేశామన్నదే ముఖ్యం అన్నారు. చిత్తశుద్దితో పనిచేసి చూపెడితే ప్రజలు విశ్వసిస్తారన్నారు. పాత పాలమూరు పచ్చబడాలన్నదే త‌మ‌ ప్రయత్నం అన్నారు. నియోజకవర్గంలో మిగిలిన భూములకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తాన‌ని చెప్పారు. 


నియోజకవర్గంలోని 216 ఆవాసాలలో 5 గ్రామాలు, 8 తండాలకు మాత్రమే సాగునీరు రావడం లేద‌ని తెలిపిన మంత్రి ఆ గ్రామాల‌కు కూడా సాగునీరు ఇచ్చి రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెడతాన‌న్నారు. వనపర్తి జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రణాళికాబద్దంగా సాగుతున్న‌ట్లు తెలిపారు. సాగునీరు మాత్రమే కాదు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో ఉపాధి కల్పించే చర్యలు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తామ‌న్నారు. ప్రతి గ్రామానికి వస్తా, ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామ‌ని పేర్కొన్నారు.