e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home Top Slides ప్రమాదంలో ఇరిగేషన్‌ అస్తిత్వం

ప్రమాదంలో ఇరిగేషన్‌ అస్తిత్వం

ప్రమాదంలో ఇరిగేషన్‌ అస్తిత్వం
  • రివర్‌బోర్డుల గెజిట్‌ ఏకపక్షం
  • బోర్డుకు అపరిమిత అధికారాలు చట్టవిరుద్ధం
  • కేంద్రం తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం
  • విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి విమర్శ
  • ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ

హైదరాబాద్‌, జూలై 16 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీయాజమాన్యాల బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం ఏకపక్షంగా గెజిట్‌ను విడుదలచేసిందని, ఇది తెలంగాణ సమాజానికి తీరని ద్రోహమని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం విడుదలచేసిన గెజిట్‌ రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ అస్తిత్వానికే ప్రమాదకరమని చెప్పారు. రివర్‌ బోర్డుల ఏర్పాటు నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’తో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

రివర్‌ బోర్డుల నోటిఫికేషన్‌పై మీ అభిప్రాయం?
కేంద్ర ప్రభుత్వం పూర్తి ఏకపక్షంగా రివర్‌బోర్డులను నోటిఫైచేసింది. విభజన చట్టం కల్పించిన దానికంటే ఎక్కువగా రివర్‌బోర్డులకు అధికారాలను కట్టబెట్టింది. మైనర్‌ ఇరిగేషన్‌ మినహా, మేజర్‌, మీడియం ప్రాజెక్టులన్నింటినీ బోర్డుల పరిధిలోకే తెచ్చింది. ఇది రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నది. రాష్ట్ర జాబితాలోని సాగునీటి రంగాన్ని కేంద్ర ఆధిపత్యంలోకి తీసుకువెళ్లేలా ఉన్నది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ కూడా బోర్డుకే కట్టబెట్టింది. ఇది తెలంగాణకు జరిగిన తీరని అన్యాయం.

- Advertisement -

రివర్‌ బోర్డుల పరిధిని వివరిస్తారా?
రివర్‌బోర్డులు స్వతహాగా నీటి పంపకాలు చేయవు. కేవలం ట్రిబ్యునళ్లు ప్రకటించిన అవార్డులను మాత్రమే అమలుచేస్తాయి. ప్రాజెక్టులను, కాలువలను అవి పర్యవేక్షిస్తాయి. బోర్డుల నిర్వహణ ఖర్చును, సిబ్బందిని ఇరు రాష్ర్టాలు సమకూర్చాలన్నారు. అంటే.. సొమ్ము రాష్ర్టాలది, పెత్తనం కేంద్రానిది అన్నమాట. ప్రతి పనిలోనూ బోర్డుదే అజమాయిషీ. రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉండదు.

గెజిట్‌ విడుదల కోసం ఏపీ సర్కారు ఎందుకని పట్టుబట్టింది?
ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగా తెలంగాణ ప్రాజెక్టులను సర్వేల పేరిట కాలయాపనచేశారు. నిధులను కేటాయించలేదు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులను మాత్రం శరవేగంగా పూర్తిచేసుకున్నారు. అందుకు శ్రీశైలం ఎడమ, కుడి కాలువలే ఉదాహరణ. ఇప్పుడు గెజిట్‌ నిర్దేశించిన ప్రకారం పాత ప్రాజెక్టులకు ఏ చిన్న మార్పులుచేసినా కేంద్రం అనుమతులు తీసుకోవాలి. తెలంగాణ ఇకమీదట ప్రాజెక్టులను నిర్మించే అవకాశమే లేకుండాపోతుంది. మరొక విషయం ఏమిటంటే కృష్ణా, గోదావరి జలాలకు కేంద్రం ఏర్పాటుచేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ 1976లో రాష్ర్టాలవారీగా అవార్డులను ప్రకటించింది. దాని ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. ఆ ట్రిబ్యునల్‌ కాలపరిమితి 2001లో ముగియడంతో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. అది 2013లో నీటి అవార్డులను ప్రకటించాల్సిఉండగా, దానిపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అది పెండింగ్‌లో పడిపోయింది. ఫలితంగా బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డులనే అమలు చేస్తున్నారు. దానిప్రకారం పూర్తిగా బేసిన్‌లోనే ఉన్న తెలంగాణ ప్రాంతం 299 టీఎంసీలు వినియోగించుకుంటే, బేసిన్‌ అవతల ఉన్న ఏపీ 512 టీఎంసీలను వినియోగించుకుంటున్నది. బోర్డులను ఏర్పాటుచేసినా అవి పాత వినియోగ జలాల ఆధారంగానే పర్యవేక్షిస్తాయి. అది ఏపీ ఆలోచన. అందుకే అది బోర్డును నోటిఫై చేయాలని పట్టుబట్టింది.

జలవివాదాలకు పరిష్కార మార్గం ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం వెంటనే గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలి. సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో పెండింగ్‌ ఉన్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు కేసును పరిష్కరించేలా చూడాలి. అవార్డును ప్రకటింపజేయాలి. కొత్త ట్రిబ్యునల్‌ను, లేదంటే ప్రస్తుతమున్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కే బేసిన్‌ ఆధారంగా జలాల పునఃపంపిణీ బాధ్యతను అప్పగించాలి. వివక్షతో కాకుండా, నిష్పక్షపాతంగా, పూర్తి న్యాయబద్ధంగా కేంద్రం వ్యవహరించినప్పుడే జలవివాదాలకు పరిష్కారం లభిస్తుంది. రాజకీయ లబ్ధి కోసమో, లేదంటే రాష్ర్టాల ఒత్తిళ్లకు తలొగ్గితే సమస్యలు మరింత జటిలమవుతాయి.

తెలంగాణ సమాజం కేంద్రాన్ని ఎందుకు తప్పుబడుతున్నది?
కృష్ణా బేసిన్‌ తెలంగాణలో 66శాతానికిపైగా ఉంటే.. ఏపీలో 34శాతానికి తక్కువగా ఉంటుంది. తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తిగా బేసిన్‌లోనే ఉన్నాయి. కృష్ణా నదిపై ఏపీ నిర్మించిన ప్రాజెక్టులన్నీ బేసిన్‌ అవతల ఉన్నాయి. అంతర్జాతీయ, సహజ నీటి న్యాయసూత్రాల ప్రకారమైనా బేసిన్‌ అవసరాలు తీరిన తరువాతనే అవతలి ప్రాంతాలకు నీటిని తరలించాలి. కేంద్రం మాత్రం పాత వినియోగ జలాల ఆధారంగానే నీటివాటాలను పంపిణీ చేస్తామంటున్నది. ఇదెక్కడి ధర్మం? ఇప్పడు కూడా కేటాయింపులు ఉమ్మడి రాష్ట్ర ప్రాతిపదికగా ఉంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అర్థమేమున్నది. పాతజలాల వినియోగాల ప్రకారం తెలంగాణకు, ఏపీకి 37:63 నిష్పత్తిలో ఉండాలి. కానీ 34:66 నిష్పత్తి ఉన్నది. ఇక్కడా అన్యాయమే. నీటిని కూడా ప్రాజెక్టులవారీగా కేటాయించలేదు. ప్రధానమైన అభ్యంతరాలను, సమస్యలను పరిష్కరించకపోవడం, న్యాయమైన వాటాలను తేల్చకపోవడాన్నే తెలంగాణ తప్పుబడుతున్నది. బోర్డులను నోటిఫై చేయడాన్ని ఎంతమాత్రం కాదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రమాదంలో ఇరిగేషన్‌ అస్తిత్వం
ప్రమాదంలో ఇరిగేషన్‌ అస్తిత్వం
ప్రమాదంలో ఇరిగేషన్‌ అస్తిత్వం

ట్రెండింగ్‌

Advertisement