గురువారం 04 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:34:53

బొట్టు బొట్టు ఒడిసిపట్టి

బొట్టు బొట్టు ఒడిసిపట్టి

  • నేటికీ వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం
  • నడివేసవిలోనూ మేడిగడ్డ వద్ద ఎత్తిపోత
  • మూడు బరాజ్‌లు దాటించి ఎల్లంపల్లిలో నీటి నిల్వ
  • హైదరాబాద్‌కు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
  • ఏడాదికాలంలో 300 టీఎంసీల ఎత్తిపోత

మండే ఎండాకాలంలో సాగునీటి ప్రాజెక్టులు నీటిని ఎత్తిపోయడం ఎప్పుడైనా విన్నామా? అదికూడా తెలంగాణలో. వానకాలమొచ్చి.. వరుణదేవుడు కరుణించి.. చినుకు రాలిస్తే.. నదులకు వరద మొదలైతే తప్ప ప్రాజెక్టుల మోటర్లవంక కూడా చూడని చరిత్ర నిన్నటిది. ఇప్పుడు తెలంగాణలో నడివేసవిలోనూ కాళేశ్వరం మోటర్లు రోజుకు పది గంటలు పనిచేస్తున్నాయి. లక్ష్మీ బరాజ్‌ దగ్గర ఇప్పటికీ వెయ్యి టీఎంసీల నీటి ప్రవాహం కొనసాగుతున్నది. గోదావరిలోకి వచ్చి చేరుతున్న ప్రాణహిత జలాల ప్రతి బొట్టునూ ఒడిసిపట్టి మూడు బరాజ్‌ల మీదుగా ఎల్లంపల్లి దాకా తరలించడం అనన్యసామాన్యం. అదీ ఇంతటి ఎండకాలంలో.. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గోదావరి జీవనది. ఎండకాలంలో ప్రవాహం తగ్గి.. చిన్న పాయలాగా దిగువన ధవళేశ్వరం బరాజ్‌కు చేరుకొంటుం ది. అయితే ఈ ఏడాది గోదావరి ప్రవాహానికి మేడిగడ్డ దగ్గరే అడ్డుకట్ట పడింది. మే నెలలో కూడా ఇక్కడి లక్ష్మీ బరాజ్‌కు వెయ్యి క్యూసెక్కులు వచ్చాయి. ఈ నీటిని దిగువకు వదలకుండా ఎత్తిపోస్తూ తెలంగాణ అవసరాలకు జలాలను మళ్లిస్తున్నారు.  ఏప్రిల్‌ మొదటివారం వరకు లక్ష్మీ బరాజ్‌కు రెండుమూడు వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీంతో లక్ష్మీ పంప్‌హౌజ్‌లోని ఒకటి లేదా రెండు మోటర్లతో నీటిని అధికారులు ఎత్తిపోశారు. ఏప్రిల్‌ రెండోవారంలో వెయ్యి నుంచి 1500 క్యూసెక్కులకు వరద తగ్గింది.

మే నెలలో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. శనివారం కూడా లక్ష్మీ బరాజ్‌ వద్ద 1200 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.  అధికారులు ఈ వరదను రోజుకు 14 గంటలపాటు  నిల్వచేస్తున్నారు. సర్జ్‌పూల్‌లో ఎత్తిపోతకు తగినస్థాయికి నీటిమట్టం చేరుకోగానే పదిగంటలపాటు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంప్‌ ద్వారా 2100 క్యూసెక్కుల నీటిని సరస్వతి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడినుంచి ఒక మోటర్‌ ద్వారా పార్వతి బరాజ్‌కు తరలిస్తున్నారు. ఆ నీటిని ఎల్లంపల్లిలో నిల్వచేస్తున్నారు. ఇప్పటివరకు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. పంటల దిగుబడి మొదలైన తర్వాత ఇక తాగునీటి సమస్యపై దృష్టిసారించాయి. 

హైదరాబాద్‌ తాగునీటికి ఢోకా లేదు

నిన్నటివరకు లోయర్‌ మానేరు ద్వారా సాగునీటిని అందిస్తూ సిరులు పండించిన కాళేశ్వరం మోటర్లు.. ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ గొంతును తడుపుతున్నాయి.  హైదరాబాద్‌కు మొన్నటిదాకా గ్యారంటీ తాగునీటి సరఫరా లేదు. నాగార్జునసాగర్‌ నుంచి రోజుకు 270 ఎంజీడీ (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) నీటిని తరలిస్తున్నారు. గతేడాది మంచి వర్షాలున్నందున అక్కడినుంచి ఆ మేరకు నీటి సరఫరా కొనసాగుతున్నది. జంట జలాశయాల నుంచి కేవలం 20 ఎంజీడీలు మాత్రమే వస్తున్నాయి. మిగిలిన 172 ఎంజీడీలు గోదావరిజలాల ద్వారా హైదరాబాద్‌ తన దాహార్తిని తీర్చుకుంటున్నది. ఎల్లంపల్లిలో కనీస నీటిమట్టం ఉంటేనే హైదరాబాద్‌ తాగునీటికి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయంలో 6.61 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. తద్వారా ఒకవైపు ఎన్జీపీసీకి నీటిని తీసుకోవడంతోపాటు హైదరాబాద్‌ తాగునీటికి కూడా ఇబ్బంది రాకుండా చర్యలుతీసుకొంటున్నారు. శనివారం కూడా ఎల్లంపల్లికి 1185 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. 


కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతల వివరాలు

లక్ష్మీ బరాజ్‌

తాజా నీటి నిల్వ - 3.039 టీఎంసీలు

ఇన్‌ఫ్లో - 1,200 క్యూసెక్కులు

లక్ష్మీ పంపులోని ఒక మోటర్‌ ద్వారా 

ఎత్తిపోస్తున్నది - 2,100 క్యూసెక్కులు

సరస్వతి బరాజ్‌

తాజా నీటి నిల్వ - 5.32 టీఎంసీలు

సరస్వతి పంపుహౌజ్‌లోని ఒక మోటర్‌ ద్వారా ఎత్తిపోస్తున్నది - 2,900 క్యూసెక్కులు

పార్వతి బరాజ్‌

తాజా నీటి నిల్వ - 3.921 టీఎంసీలు

పార్వతి పంపుహౌజ్‌ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోస్తున్నది - 2,610 క్యూసెక్కులు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నుంచి ఇప్పటివరకు ఎత్తిపోసిన నీటి పరిమాణం..

లక్ష్మీ పంపుహౌజ్‌
60.5 టీఎంసీలు
సరస్వతి పంపుహౌజ్‌
55.50 టీఎంసీలు 
పార్వతి పంపుహౌజ్‌
53 టీఎంసీలు
నంది పంపుహౌజ్‌
68 టీఎంసీలు
గాయత్రీ పంపుహౌజ్‌
66 టీఎంసీలు
మొత్తం ఎత్తిపోతలు
303 టీఎంసీలుlogo