బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 02:26:14

ప్రాదేశిక ప్రాంతాలు 19

ప్రాదేశిక ప్రాంతాలు 19

  • ప్రస్తుతమున్న 13కు తోడు మరో ఆరు
  • సీఈ బాధ్యుడిగా ప్రాదేశిక ప్రాంతాలు
  • అన్ని జలవనరులు సీఈ పరిధిలోకే
  • వనదుర్గ ప్రాజెక్టుగా ఘనపూర్‌ ఆనకట్ట
  • పాకాల కాల్వల పునరుద్ధరణ
  • జలవనరులశాఖ పునర్వ్యవస్థీకరణ
  • సీఎం కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం

తెలంగాణ ఏర్పడక ముందు, ఆ తర్వాత పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. సాగునీటి వసతులు పెరిగాయి. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లు.. వీటితోపాటు ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా ఎక్కువైంది. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరులశాఖలో చీఫ్‌ ఇంజినీర్లు (సీఈ) బాధ్యులుగా ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటుచేస్తున్నాం. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా ఇకనుంచి జలవనరులశాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుంది.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నీటి పారుదలరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరులశాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు, ఆ తర్వాత పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని, సాగునీటి వసతులు పెరిగాయని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లు.. వీటితోపాటు ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా ఎక్కువైందని సీఎం తెలిపారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరులశాఖలో చీఫ్‌ ఇంజినీర్లు (సీఈ) బాధ్యులుగా ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా ఇకనుంచి జలవనరులశాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు. జలవనరులశాఖ పునర్వ్యవస్థీకరణపై మంగళవారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. 

క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఉన్న 13 చీఫ్‌ ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాల సంఖ్యను 19కి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, రామగుండం, వరంగల్‌, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్‌, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ కేంద్రాలను సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బరాజ్‌లు, పంప్‌హౌజ్‌లు, కాల్వలు, సబ్‌స్టేషన్లు అన్నీ సీఈ పరిధిలోకే వస్తాయి. గతంలో భారీ, మధ్య, చిన్నతరహా, ఐడీసీ లాంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటిపారుదలశాఖ ఇకపై  కేవలం జలవనరులశాఖగా మాత్రమే కొనసాగనున్నది. మెదక్‌ జిల్లాలోని ఘనపూర్‌ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా పేరుపెట్టాలని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా నిర్ణయించారు.

పాకాల కాల్వల పునరుద్ధరణ

పాకాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంనాటి కాల్వలు శిథిల మయ్యాయని, వీటి పునరుద్ధరణ ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. స్పందించిన సీఎం కేసీఆర్‌ కాకతీయులు నిర్మించిన పాకా ల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమేనని పేర్కొన్నారు. వెంటనే అంచనాలు రూపొందించా లని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎం వో కార్యదర్శి స్మితాసబర్వాల్‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండే, సీబీ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఎన్సీ అనిత, డీడీఏ చందర్‌రావు, ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు, ఈఈలు కే ప్రసాద్‌, ఎస్‌ విజయ్‌కుమార్‌, డీఈఈ వెంకటనారాయణ, ఏఈఈ శివకుమార్‌, కేపీఎం ఏఏ రత్నం పాల్గొన్నారు.


logo