శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:36:05

సాగునీటిరంగంలో నవ శకం

సాగునీటిరంగంలో నవ శకం


  • నీటిపారుదలశాఖ పేరు మార్పు
  • జలవనరులశాఖగా నామకరణం
  • జలవనరులశాఖ ప్రతిపాదనలకు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం!హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సాగునీటిరంగంలో నవశకం మొదలుకానున్నది. సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు నీరందించేందుకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది. నీటిపారుదలశాఖ పేరును జలవనరులశాఖగా మార్చింది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు శాఖ పునర్వ్యవస్థీకరణతో పకడ్బందీ నిర్వహణకు ప్రణాళిక సిద్ధమైంది. జలవనరులశాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే ఉత్తర్వులు జారీకానున్నాయి. తెలంగాణ జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రవ్యాప్తంగా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు చెరువులు, లిఫ్టు స్కీంలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. చీఫ్‌ ఇంజినీర్ల పరిధిని నిర్ధారించి.. ఆ పరిధిలోని అన్నిరకాల ప్రాజెక్టులను సంబంధిత సీఈ పర్యవేక్షించనున్నారు. కృష్ణా, గోదావరి బేసిన్ల చెరువుల పర్యవేక్షణకు ఉన్న మైనర్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్లు ఇక ఉండరు. ఐబీ డివిజన్లలోని ఇంజినీర్లు కూడా క్షేత్రస్థాయి సీఈ పరిధిలోకి వచ్చి అన్నిరకాల ప్రాజెక్టుల్లో పనిచేయనున్నారు.

పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో మరికొన్ని అంశాలు

  • ఇప్పటికే రెండు ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ పోస్టులు ఉండగా.. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఈఎన్సీ కొత్త పోస్టు రానున్నది. 
  • అంతర్రాష్ట్ర విభాగం సీఈ, హైడ్రాలజీ సీఈ పోస్టులను తొలగించారు. హైడ్రాలజీ, కాడా బాధ్యతల్ని వాలంతరి సీఈకి అప్పగించారు. 
  • క్షేత్రస్థాయిలో 19 మంది చీఫ్‌ ఇంజినీర్లు ఉండనున్నారు. హైదరాబాద్‌ స్థాయిలో సీడీవో, వాలంతరి, క్వాలిటీ కంట్రోల్‌, సచివాలయం, విచారణలు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల చీఫ్‌ ఇంజినీర్లు ఉంటారు.

అత్యవసర పనుల కోసం

ప్రాజెక్టుల పరిధిలో అత్యవసర పనుల కోసం ఇంజినీర్లకు ఉన్న ప్రస్తుత మంజూరీ అధికారాన్ని ప్రభుత్వం పెంచింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు ఇప్పుడు పనుల మంజూరీ అధికారాలు లేవు. కానీ కొత్తగా రెండు లక్షల చొప్పున పనుల్ని ఏడాదికి గరిష్ఠంగా రూ.ఐదు లక్షల వరకు మంజూరు చేయవచ్చు. ఈఈ, ఎస్‌ఈ, చీఫ్‌ ఇంజినీర్‌, ఈఎన్సీకి కూడా పనుల మంజూరు అధికారాన్ని పెంచింది. 

హైదరాబాద్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ హర్షం

నీటిపారుదలశాఖ పేరును జల వనరులశాఖగా మార్చడం, కొత్తగా 618 ఇంజినీర్ల పోస్టులను పెంచేందుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలుపడంపై హైదరాబాద్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేసింది. గౌరవాధ్యక్షులు వెంకటేశం, మహేందర్‌, అధ్యక్షుడు ఏఎస్‌ఎన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్‌ తదితరులు.. సీఎం కేసీఆర్‌, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

భారీగా పెరుగనున్న పోస్టులు

పునర్వ్యవస్థీకరణ ప్రక్రియతో జల వనరులశాఖలో పోస్టుల సంఖ్య భారీగా పెరుగనున్నది. శాఖలో ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ ప్రస్తుతం 3,389 మంది ఉండగా.. కొత్తగా 618 పోస్టులు మంజూరుచేశారు. దీంతో ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ సంఖ్య 4007కి చేరనున్నది. ఇతర సహకార (సపోర్టింగ్‌) స్టాఫ్‌ పోస్టులు ప్రస్తుతం వెయ్యి ఉండగా.. అదనంగా 327 పోస్టులు చేరి వాటి సంఖ్య 1,327కి పెరుగనున్నది. ఇలా మొత్తం జల వనరులశాఖలో పోస్టుల సంఖ్య 5,334కి చేరనున్నది. ఇంజినీరింగ్‌ స్టాఫ్‌కు సంబంధించి.. 3 ఈఎన్సీ పోస్టులు, మూడు సీఈ పోస్టులు, అలాగే పది ఎస్‌ఈ, 28 ఈఈ, 214 డీఈఈ పోస్టులను పదోన్నతుల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ లేదా ఏఈఈ పోస్టులు ప్రస్తుతం 2,436 ఉండగా.. 360 కొత్త పోస్టులను నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.


logo