శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 24, 2020 , 00:56:23

మొక్కలు నాటేందుకు రండి

మొక్కలు నాటేందుకు రండి
  • ఎంపీ సంతోష్‌కుమార్‌ను ఆహ్వానించిన ఐవోసీ
  • గ్రీన్‌చాలెంజ్‌ స్ఫూర్తితో ముందుకు వచ్చిన సంస్థ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గీన్‌ ఇండియా చాలెంజ్‌ స్ఫూర్తితో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ (ఐవోసీ) జపాన్‌లో ప్రజాదరణ పొందిన మియావాకి పద్ధతిలో అటవీ పునరుద్ధరణకు ముందుకు వచ్చింది. జీహెచ్‌ఎంసీ సహకారంతో గచ్చిబౌలిలో మొక్కనాటి ప్రారంభించనున్న ఈ వినూత్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆ సంస్థ సీఎస్సార్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ గురువారం ప్రగతిభవన్‌లో రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌కు కలిసి ఆహ్వానించారు. 


ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఐవోసీ నిర్ణయం పట్ట హర్షం వ్యక్తంచేశారు. పెట్రోల్‌, డీజిల్‌ వంటి సహజ వనరులు రోజురోజుకూ ఖర్చయిపోతున్నాయని, ఈ నేపథ్యంలో ‘భవిష్యత్‌తరాలకు ధన సంపద కన్నా.. వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యం’ అన్న సీఎం కేసీఆర్‌ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పేర్కొన్నారు. పచ్చదనాన్ని, ప్రకృతిని, సహజవనరులను పునరుద్ధరించే చర్యలను చేపట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. ఆ దిశగా ముందడుగు వేసిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. 


సహజ వనరుల ఖర్చులో పరోక్షంగా భాగస్వామ్యం అవుతున్న పెట్రోల్‌, డీజిల్‌ విక్రయ సంస్థలు పచ్చదనం పెంపు విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఐవోసీని స్ఫూర్తిగా తీసుకొని ఇతర కంపెనీలు కూడా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పచ్చదనం పెంపునకు ముందుకు రావాలని కోరారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లక్ష్యం కూడా అందరికీ పచ్చదనం పట్ల ఆసక్తిని కలిగించడమేనని స్పష్టంచేశారు. ఆ దిశగా ఐవోసీ ముందుకు రావడం.. అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించడం.. పచ్చదనం పెంపులో గుణాత్మక పరిణామం అని అభిప్రాయపడ్డారు. 


ఘట్‌కేసర్‌లో అంతరించిపోతున్న అడవిని దత్తత తీసుకొని తాము పెంచుతున్నామని, రానున్న రోజుల్లో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఐవోసీ సంస్థ సీఎస్సార్‌ జీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ.. విద్య, శానిటేషన్‌ వంటి రంగాల్లో తమ సంస్థ ఇప్పటికే తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. హరితహారం, గ్రీన్‌చాలెంజ్‌ స్ఫూర్తితో అటవీ పునరుద్ధరణకు ఐవోసీ ముందుకు వచ్చిందని అన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యనిర్వాహకుడు రాఘవ తదితరులు పాల్గొన్నారు.


మేము సైతం అంటూ..

హరితహారం స్ఫూర్తిగా రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా సామాన్యులు, సెలబ్రిటీలనే కాకుండా బడా కంపెనీలను పచ్చదనం వైపు ఆలోచించేలా చేసి మొక్కలను నాటేందుకు స్ఫూర్తి నిస్తున్నది. తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా పలు కార్యక్రమాలను చేపట్టే సంస్థలు, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించనంతగా పచ్చదనంపై దృష్టి పెట్టలేదు. సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన హరితహారం పలువురిలో స్ఫూర్తి నింపుతున్న సంగతి తెలిసిందే. 


అదే స్ఫూర్తితో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించి గ్రీన్‌చాలెంజ్‌ ప్రగతిభవన్‌ నుంచి ప్రారంభమై నేడు విశ్వవ్యాప్తమైంది. ఒక మొక్క పెరిగి వటవృక్షమై విస్తరించినట్టు.. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం రోజురోజుకు హరిత ప్రేమికులతో పాటు కార్పొరేట్‌ సంస్థల్లో కూడా స్ఫూర్తిని నింపుతున్నది. అంతరించిపోతున్న అడవుల పునరుద్ధరణ దిశగా ప్రముఖ సంస్థ ఐవోసీ ముందుకు వచ్చింది.


logo