గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:05:53

ఇన్వెస్ట్‌ తెలంగాణ

ఇన్వెస్ట్‌ తెలంగాణ

  • ఇతర రాష్ర్టాలతో పోటీ కొనసాగిస్తూనే.. 
  • రాష్ర్టానికి పెట్టుబడుల ఆకర్షణ
  • మదుపరులకు తెలంగాణ గమ్యస్థానం 
  • పారిశ్రామికవేత్తలకు సమాచారం కోసం వెబ్‌సైట్‌ 
  • పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు 
  • ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇతర రాష్ర్టాలతో స్నేహపూర్వక పోటీని కొనసాగిస్తూనే.. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తెలంగాణ పరిశ్రమలశాఖ, ఐటీ శాఖ, ఇన్వెస్ట్‌ తెలంగాణ విభాగం కలిసి రూపొందించిన ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ వెబ్‌సైట్‌ను ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సులభతర వాణిజ్యంలో తెలంగాణ వరుసగా అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నదని పేర్కొన్నారు. 

రాష్ర్టానికి పెట్టుబడుల ఆకర్షణలో ప్రమోషన్‌ విభాగానికి అత్యంత కీలకమైన ప్రాధాన్యమున్నదని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేవారి కోసం ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ సంపూర్ణ సమాచారమందిస్తుందని తద్వారా ఆయా సేవలను పెట్టుబడిదారులు నేరుగా వినియోగించుకొనే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఈ వెబ్‌సైట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ భాషల్లోనూ ఈ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 

ఈ వెబ్‌సైట్‌పై ఎవరైనా ఫీడ్‌బ్యాక్‌ అందించాలనుకుంటే [email protected] telangana.gov.inకు పంపాలని సూచించారు. https://invest.telangana. gov.in లింక్‌ ద్వారా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, పరిశ్రమలశాఖ కమిషనర్‌ మాణిక్‌రాజ్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. 


logo