గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 02:29:06

దుష్ప్రచారాలకు పెట్టుబడులే సమాధానం

దుష్ప్రచారాలకు పెట్టుబడులే సమాధానం

  • కరోనా సంక్షోభంలోనూ అదేజోరు
  •  వేల మందికి ఉపాధి అవకాశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఏర్పడక ముందు.. ఆ తరువాత రాష్ర్టానికి వ్యతిరేకంగా అభివృద్ధి నిరోధక శక్తులు పన్నిన కుట్రలు, చేసిన దుష్ప్రచారాలు  అన్నీ ఇన్నీ కావు. వర్షాలు వస్తే హైదరాబాద్‌ మునిగిపోతుందని, శాంతి భద్రతలు సవ్యంగా లేవని, అసలు కరెంటే లేదని, కొత్త పాలకులకు పరిపాలన సామర్థ్యం లేదని చెప్పుకొచ్చారు. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడుల ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. కరోనా కాలంలోనే దాదాపు రూ.5వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. ఇప్పుడు అమెజాన్‌ ఏకంగా 20 వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నది. కరోనా సమయంలో ఏస్టర్‌ ఫిల్మ్‌ టెక్‌ లిమిటెడ్‌ సంస్థ ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ రూ.1,350కోట్లు, సాయి లైఫ్‌ సైన్సెస్‌ రూ.400కోట్ల పెట్టుబడులు, నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.500కోట్లు, మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ రూ.1,100కోట్లు, మెడ్‌ట్రానిక్స్‌ రూ.1,200కోట్ల పెట్టుబడులను కరోనా కాలంలో  పెట్టాయి. ప్రఖ్యాత నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ, వన్‌ ప్లస్‌ స్టోర్‌,  లైఫ్‌ స్పాన్‌ ప్లాంట్‌లు బుధవారం తమ యూనిట్లు ఏర్పాటు చేశాయి. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు, తిరోగామి శక్తులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, వాటన్నింటిని పటాపంచలు చేస్తూ పెట్టుబడులు తరలివస్తున్నాయి. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, సానుకూలమైన వాతావరణం, పారదర్శకమైన పరిపాలన, మంత్రి కేటీఆర్‌ నిత్య పర్యవేక్షణ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పి స్తూ.. ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉండే విధంగా వారికి శిక్షణను ఇప్పిస్తున్నది.  పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు, మానవవనరులు, ముడిసరుకు లభి ంచేలా ఏర్పాట్లు చేయడమే కాకుండా 24 గంటలూ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు.

15లక్షల మందికి ఉపాధి అవకాశాలు

కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు వచ్చే విధంగా టీఎస్‌ఐపాస్‌ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చారు. టీఎస్‌ఐపాస్‌ ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు రాష్ర్టానికి 13,662 పరిశ్రమలు రాగా వీటి ద్వారా రూ. 2,04,038.65కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వీటి ద్వారా 14,47,261మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన గూగుల్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలతో పాటు నోవార్టిస్‌, సేల్స్‌ఫోర్స్‌, వెల్‌స్పన్‌, పీఅండ్‌జీ సహా అనేక ఇతర సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి.