మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 08:23:25

ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయాడు...

ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయాడు...

హైదరాబాద్ ‌:  అతను.. ఘరానా దొంగ.. పక్క రాష్ట్రంలో 55 కేసుల్లో నిందితుడు.. ప్రేయసి కోసం రాష్ట్రం దాటి నగరానికి వచ్చాడు. గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేశాడు.. అయితే డబ్బుల కోసం మధురాననగర్‌లో చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి రూ.8 లక్షల విలువ చేసే 19 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌  .. పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ, డీఐ అజయ్‌ కుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. 

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, కొంకపల్లికి చెందిన పతివాడ లోవరాజు (26) పగటి పూట రెక్కీ నిర్వహించి.. తాళాలు వేసి ఉన్న ఇండ్లల్లో రాత్రి సమయాల్లో దొంగత నానికి పాల్పడుతున్నాడు. జైల్లో పరిచయమైన ఇద్దరు సహచరులతో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 47 చోరీలు చేశాడు. గతంలో చేసిన చోరీ కేసుల్లో అరస్టై జైలు కు వెళ్లి.. 2019 జూన్‌లో విడుదలయ్యాడు. తిరిగి చోరీలు చేయడం మొదలు పెట్టాడు.  అమలాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 4, అముదాల వలసలో 1, నర్సీపట్నంలో 2, కొత్తపేటలో 1 చోరీలు చేశాడు. 

కాగా.. ఇటీవల పరిచయం అయిన ఓ యువతి కోసం  లోవరాజు  హైదరాబాద్‌కు వచ్చాడు.. ఎస్సార్‌ నగర్‌ పీఎస్‌ ప్రాంతంలో ఉంటూ ప్రేయసితో కలిసి చోరీ చేసిన సొత్తుతో జల్సా చేశాడు. డబ్బులు అయిపోవడంతో ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధురా నగర్‌లో చోరీ చేశాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  రహ్మత్‌ నగర్‌లోని ప్రేయసి ఇంటి వద్దకు రాగానే నిందితుడు లోవరాజును పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 19 తులాల బంగారు ఆభరణాలను  స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని డీసీపీ వెల్లడించారు. దొంగను పట్టుకున్న సిబ్బందిని డీసీపీ అభినందించారు. 


logo