బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 02:06:52

ధైర్యమే ఆయుధం

ధైర్యమే ఆయుధం
  • నేటితరం మహిళలు, యువతులు అధైర్యపడవద్దు
  • రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఉద్బోధ
  • హైదరాబాద్‌ సిటీపోలీస్‌ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

సుల్తాన్‌బజార్‌: నేటితరం మహిళలు, యువతులు, విద్యార్థినులు ధైర్యంగా ముందుకుసాగాలని, ధైర్యమే ఆయుధమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ సిటీపోలీస్‌, షీ టీమ్స్‌, భరోసా కేంద్రాల సంయుక్తాధ్వర్యంలో కోఠి మహిళా కళాశాలలో గురువారం అంతర్జాతీయ మహిళాదినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ ఆయా రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళలకు అవార్డులను అందజేసి సత్కరించారు. 


అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకోసం పోలీసుల చేస్తున్నకృషి అభినందనీయమన్నారు. తాను తంజావూరు మెడికల్‌ కళాశాలలో విద్యార్థినిగా ఉన్న సమయంలో ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లను అడ్డుకున్నానని చెప్పారు. మహిళలు, యువతులు, విద్యార్థినులు ఆత్మరక్షణ విద్యలో శిక్షణపొంది తమనుతాము రక్షించుకుంటూనే ఇబ్బందులకు గురిచేసేవారిని అక్కడే శిక్షించాలని చెప్పారు. 


పిరికిపందలా ఆత్మహత్యలు చేసుకోవద్దని హితవుపలికారు. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన సుమారు 200 మంది మహిళలను కాపాడిన లేక్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మిని ప్రత్యేకంగా అభినందించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. నగరంలో షీటీమ్స్‌, భరోసా కేంద్రాలతో మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. యువతులు, విద్యార్థినులు ఎటువంటి ఆపదలో ఉన్నా 100కు డయల్‌చేయాలని సూచించారు. 


ఈ కార్యక్రమంలో సెషన్స్‌జడ్డి సునీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఐఎఫ్‌ఎస్‌వో ఎండీ మంజులవాణి, వనితా టీవీచానెల్‌ వ్యవస్థాపకురాలు తుమ్మల రమాదేవి, ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ వైజయంతి, ఫిట్‌నెస్‌ గురు దినాజ్‌, కోఠి మహిళాకళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రోజారాణి, ఉస్మానియా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శశికళారెడ్డి, డీసీపీలు రమేశ్‌రెడ్డి, బాబురావు, కరుణాకర్‌రెడ్డి, అదనపు డీసీపీ గోవింద్‌రెడ్డి, సునీతారెడ్డి, ఏసీపీలు పీ దేవేందర్‌, శ్రీనివాస్‌రెడ్డి, జ్యోతి, ప్రసాద్‌, శ్రీదేవి, సీఐలు కే సుబ్బరామిరెడ్డి, పీజీరెడ్డి, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>