సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:49:34

మనచేప.. తెలంగాణేన్సిస్‌

మనచేప.. తెలంగాణేన్సిస్‌

  • పులిచారలతో కొత్తరకం మీనం
  • కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో లభ్యం
  • అరుదైన మత్స్యానికి అంతర్జాతీయ గుర్తింపు

ఉండేది రెండు అంగుళాల పొడవే.. కానీ అడవి అంతటినీ హడలెత్తించే పులి చారలు దానిపై ఉంటాయి. అది ఉండేది కూడా ఆదిలాబాద్‌ జిల్లాలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లోనే. చూడగానే ఎంతో ముచ్చటగొలుపుతున్న ఈ అరుదైన మత్స్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. మొత్తం జీవ ప్రపంచంలోనే ఇంతవరకు ఇటువంటి రకం చేప లేదని తేలింది. అందుకే తెలంగాణకు ప్రత్యేకమైన ఈ చేపకు ‘తెలంగాణేన్సిస్‌' అనే శాస్త్రీయ నామం పెట్టారు. 

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉస్మానియా జంతుశాస్త్ర పరిశోధకులు కంటె కృష్ణప్రసాద్‌, చెలమల శ్రీనివాసులు, ఆదిత్య శ్రీనివాసులు పులిచారలున్న ఈ కొత్త రకం చేపను కనుగొన్నారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ పరిశోధనలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుడు నీలేశ్‌,  కేరళలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఓషన్‌ స్టడీస్‌కు చెందిన అనూప్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ కొత్త రకం చేపను ‘జటాక్సా’ అనే అంతర్జాతీయ పరిశోధనా సంస్థ గుర్తించి, ఆ సమాచారాన్ని తన పత్రికలో ప్రచురించింది. శరీర లక్షణాలతోపాటు దాని మైటోకాండ్రియా, డీఎన్‌ఏ కూడా వేరుగా ఉండటంతో దీనిని కొత్తరకం చేపగా గుర్తించారు. ఈ చేపను మొదటిసారిగా తెలంగాణలో కనుగొన్నందుకు రాష్ట్రం పేరుతోనే దానిక శాస్త్రీయ నామం ఖరారు చేసినట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు చెలమల శ్రీనివాసులు చెప్పారు. ఈ చేపలు కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని కుంటలు, చెరువులలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

మరో అరుదైన చేప

 గంగానదిలో మాత్రమే కనిపించే ‘స్ప్రాట్‌ కొరికా సోబోర్నా’ అనే మరో అరుదైన చేపను ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధకులు కుమ్రరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తలై గ్రామం సమీపంలో గుర్తించారు. కేవలం రెండు నుంచి మూడు అంగుళాల పొడవుండే ఈ జాతి చేపలు గంగా నది, దాని ఉపనదులలో లభిస్తాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచి తూర్పు బంగ్లాదేశ్‌ వరకు వీటి ఉనికి ఉన్నది. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌లో కూడా ఈ జాతి చేపలున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ చేప వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగానికి చెందిన కంటె కృష్ణప్రసాద్‌, జీవవైవిధ్య సంరక్షణ కేంద్రానికి చెందిన మహమ్మద్‌ యూనస్‌ సేకరించారు. ఆ వివరాలు అంతర్జాతీయ పరిశోధన పత్రిక ‘జర్నల్‌ ఆఫ్‌ త్రేనెడ్‌ టాక్సా’ సంచికలో ప్రచురితమయ్యాయి. ‘బెంగాలీ కెచ్చి’గా పిలిచే ఈ చేప ఉనికి తెలంగాణ పరిధిలోని గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉండటం ఆసక్తికరమని ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చెలమల శ్రీనివాసులు పేర్కొన్నారు. తెలంగాణలో ఎంతో జీవవైవిధ్యం ఉన్నదని ఈ క్రమంలో మరిన్ని శాస్త్రీయ సర్వేలు, అధ్యయనాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.