శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 01:51:51

కన్నతండ్రే కడతేర్చాడు

 కన్నతండ్రే కడతేర్చాడు
  • కూతురిని పోషించలేకే ఘాతుకం
  • రాధిక హత్యకేసులో వీడిన మిస్టరీ.. వివరాలు వెల్లడించిన సీపీ

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసులో తండ్రే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. కూతురి వైద్యానికి ఖర్చు పెట్టలేక, పెండ్లికి కట్నం ఇచ్చుకోలేకే ఈ ఘాతుకానికి ఒడిగడినట్టు తండ్రి పేర్కొనడం విస్మయానికి గురిచేసింది. నిందితుడిని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకొని సోమవారం మీడియా ఎదుట హాజరుపరిచారు. సీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో గతనెల 10న ఇంటర్‌ విద్యార్థిని ముత్త రాధిక(19) దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై రాధిక తండ్రి కొమురయ్య పలువురిపై అనుమానం వ్యక్తం చేశాడు. హత్య చేసిన వ్యక్తి మూడు తులాల బంగారం, రూ.99 వేల నగదు ఎత్తుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో విచారణ జరిపారు. సుమారు 390 మందిని విచారించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ బృందాన్ని రంగంలోకి దింపి, మరోసారి ఆధారాల కోసం ప్రయత్నించారు. ఫోరెన్సిక్‌ బృందం జరిపిన దర్యాప్తులో పలు ఆధారాలు లభ్యమయ్యాయి. రాధిక తండ్రి కొమురయ్య బనియన్‌, దుప్పటిపై ఉన్న రక్తపు మరకలు, ఇంట్లో రాధిక హత్య జరిగినప్పటి రక్తపు మరకలు సేకరించి దర్యాప్తుచేశారు. రాధిక రక్తంలోని డీఎన్‌ఏ కొమురయ్య బనియన్‌పై లభ్యమైన రక్తపు మరకల డీఎన్‌ఏ ఒకటేనని నిర్ధారించుకున్నారు. సాంకేతికంగా కేసు నిర్ధారణ అయ్యేందుకు అవసరమైన ఆధారాలన్నీ సేకరించిన పోలీసులు, ఆదివారం బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా హత్య చేసింది తానేనని అంగీకరించాడు. 


ఆర్థిక భారం మోయలేక..

హత్యకు గల కారణాలను కొమురయ్య వివరించిన తీరు పోలీసులను విస్మయానికి గురిచేసింది. రాధిక దివ్యాంగురాలు కావడంతో ఆమె ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేసిన కొమురయ్య ఆర్థికంగా నష్టపోయాడు. ఆమె వైకల్యం నుంచి బయటపడినా తరుచూ అనారోగ్యానికి గురవుతుండటంతో వైద్యం చేయించేందుకు డబ్బు అవసరం పడుతుందనీ, పెండ్లి చేసి పంపించినా కట్నం ఇవ్వాల్సి వస్తుందని భావించి ఎవరికీ అనుమానం రాకుండా తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. హతుడి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు సంబంధిత ఆధారాలు సేకరించారు. హత్యజరిగిన సమయంలో బంగారం, నగదును తానే దాచిపెట్టినట్టు కొమురయ్య అంగీకరించడంతో వాటిని స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. కేసులో దర్యాప్తు పూర్తయిందని, నిందితుడికి శిక్ష పడేందుకు అవసరమయ్యే అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు.

logo