ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 06:57:38

నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు... ఫస్టియర్ పేపర్-1 కు సెట్-ఏ ఎంపిక

నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు... ఫస్టియర్ పేపర్-1 కు సెట్-ఏ ఎంపిక

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 65 వేల 839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు.  ఉదయం 8.45 గంటలకు తమకు కేటాయించిన సీట్లో విద్యార్థులు కూర్చోవాలి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షలకు అనుమతి ఉండదు. విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. నేడు ఇంటర్ మొదటి సంవత్సరం, రేపు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం.  ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4 లక్షల 80 వేల 516 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అదేవిధంగా 4 లక్షల 85 వేల 323 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షలకు రాష్ర్టవ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ ను నియమించారు. 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో బిగ్ ఆర్ఎస్ ద్వారా ఆన్ లైన్ లో ఫిర్యాదుల స్వీకరించనున్నారు. హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 040-24600110. ఈ నెంబర్ కు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ చేయొచ్చు. విద్యార్థులు ఒత్తిడికి లోనైతే 73372 25803 నంబర్ కు ఫోన్ చేయాలని సైకలాజిస్టులు సూచించారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. భయం, ఆందోళన, ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు.. ఇంటర్‌బోర్డు నియమించిన సైకాలజిస్టులను ఫోన్‌లో సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని సూచించారు.


logo