ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 01:51:04

ఇంటర్‌ ప్రవేశాలు షురూ!

ఇంటర్‌ ప్రవేశాలు షురూ!

 • 30 వరకు తొలివిడుత అడ్మిషన్లు
 • రేపటి నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు
 • వెబ్‌సైట్‌లో కళాశాలల వివరాలు
 • ప్రవేశపరీక్షలు నిర్వహిస్తే చర్యలు
 • ఇంటర్‌బోర్డు మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని ఇంటర్‌ కాలేజీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు ఇంటర్మీడియట్‌ బోర్డు అనుమతి ఇచ్చింది. తొలి విడుత నోటిఫికేషన్‌ను బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌జలీల్‌ బుధవారం జారీచేశారు. నోటిఫికేషన్‌ ప్రకారం.. బుధవారం నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. తొలి విడుత ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీని గడువుగా నిర్ణయించారు. రెండో విడుత అడ్మిషన్లకు త్వరలో మరో నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించుకునేందుకు అనుమతి ఇచ్చారు. కొవిడ్‌ నేపథ్యంలో రెగ్యులర్‌ తరగతులు నిర్వహించే పరిస్థితులు లేకపోవటంతో ఆన్‌లైన్‌ క్లాసులకు బోర్డు అనుమతిచ్చింది. ఇక, జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు పదో తరగతి ఇంటర్నెట్‌ మార్కుల మెమోతో తాత్కాలికంగా ప్రవేశాలు చేసుకోవచ్చని తెలిపింది. తర్వాత ఒరిజినల్‌ పత్రాలు, టీసీ సమర్పించాక ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొన్నది. ప్రవేశాల్లో బోర్డు నిబంధనలు, రిజర్వేషన్లు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. అడ్మిషన్ల పేరుతో ఎలాంటి ప్రవేశపరీక్షలు నిర్వహించవద్దని, కాదని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇంటర్‌ బోర్డు మార్గదర్శకాలు:

 • రాష్ట్రంలోని ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, సోషల్‌, ట్రైబల్‌, బీసీ వెల్ఫేర్‌, మోడల్‌ స్కూల్‌, ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశం పొందాలనుకు నే విద్యార్థి ఆధార్‌ నంబరును సమర్పించాలి.
 • విద్యార్థులు అఫిలియేషన్‌ పొందిన జూనియర్‌ కాలేజీలో మాత్రమే ప్రవేశాలు పొందాలి. అనుబంధ కాలేజీల వివరాలకు acadtsbie.cgg. gov.in, tsbie.cgg.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలి.
 • అనుమతి పొందిన కోర్సులు, సెక్షన్లకు మాత్రమే ప్రైవేటు కాలేజీలు ప్రవేశాలు నిర్వహించాలి. ప్రతి విభాగంలో 88 కంటే ఎక్కువమంది విద్యార్థులను తీసుకోవద్దు. బోర్డు రద్దు చేసిన కాంబినేషన్లతో ప్రవేశాలు చేయవద్దు. 
 • ప్రతి జూనియర్‌ కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి బోర్డు మంజూరు చేసిన కోర్సులు, సెక్షన్లు, సీట్ల వివరాలను నోటీసు బోర్డులో అందరికీ తెలిసేలా పెట్టాలి. నిండిన సీట్లు, ఖాళీల వివరాలు ప్రతి రోజూ నోటీసు బోర్డులో ఉంచాలి.
 • అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను ప్రేరేపించేలా ప్రకటనలు జారీ చేయవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు అనివార్యం.
 • అర్హత పరీక్షల రికార్డుల్లో ఉన్న జోగిని పిల్లలకు సంబంధించి తండ్రి పేరుకు బదులు తల్లి పేరు చేర్చాలి.


logo