బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 02:29:35

ధరణిపై సరిహద్దు రాష్ర్టాల్లోనూ ఆసక్తి

ధరణిపై  సరిహద్దు రాష్ర్టాల్లోనూ ఆసక్తి

  • ధరణిపై మహారాష్ట్ర, కర్ణాటక గ్రామాల్లో చర్చ
  • తాసిల్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్‌ సేవలపై ఆశ్చర్యం
  • అలాంటి విధానమే కావాలంటున్న మరాఠీలు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ధరణిపై పొరుగు రాష్ర్టాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దును కలిగిన బోధన్‌, జుక్కల్‌ నియోజకవర్గాల్లో ధరణి సేవల అమలు తీరును మహారాష్ట్ర, కర్ణాటకవాసులు తెలుసుకుంటున్నారు. మన రాష్ట్ర సరిహద్దు మండలాలతో మహారాష్ట్ర గ్రామాలకు నిత్యం రాకపోకలు, విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో సరిహద్దు గ్రామాల్లో ఏ ఇద్దరు రైతులు కలిసినా ధరణి గురించే చర్చ సాగుతున్నది. రెవెన్యూ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు, పోర్టల్‌ ద్వారా తాసిల్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తుండటం, అరగంటలోనే భూబదలాయింపు పూర్తయ్యి.. పాస్‌బుక్‌ చేతికందుతుండటంపై ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే బోధన్‌, రెంజల్‌ మండలాల సరిహద్దు వెంబడి నాందేడ్‌ జిల్లా (మహారాష్ట్ర)లోని 42 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ప్రాంత ప్రజలు కొంతకాలంగా డిమాండ్‌చేస్తున్నారు. ఇటీవల దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి హరీశ్‌రావును కలిసిన అక్కడి ప్రజాప్రతినిధులు తమ చిరకాల వాంచను వెలిబుచ్చారు. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు, వాటి కారణంగా పల్లెవాసుల జీవితాల్లో వస్తున్న మార్పులను ఆరేండ్లుగా వారు నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. తాజాగా తెలంగాణ అమల్లోకి తెచ్చిన రెవెన్యూ సంస్కరణలనూ మహారాష్ట్ర రైతాం గం ఆసక్తిగా తెలుసుకుంటున్నది. మండల కేంద్రంలోనే అరగంటలో భూబదలాయింపు జరిగిపోతుండటం, లంచాలకు అవకాశం లేకుండా పోవడం వంటివి వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. విదర్బలో రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లకు, వాటి పరిధిలో కనీసం 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరమున్న గ్రామాలూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి ధరణి ఒక అద్భుతంగా కనిపిస్తున్నది.

ఈ సౌలత్‌ మాకూ ఉంటే బాగుండు

మాకు కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలో వ్యవసాయ భూమి ఉన్నది. మా తల్లిదండ్రులు గతంలోనే ఇక్కడ భూమి కొన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ద్వారా మా భూము లను మార్పిడి చేసుకుంటాం. నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకుంటే తాసిల్‌ కార్యాలయంలో అరగంటలో పట్టా మార్పిడి అవుతున్నదని విన్నాను. మహారాష్ట్రలో కూడా ఇలాంటి సౌలత్‌ ఉంటే చాలా బాగుంటుంది.

- శివరాజ్‌, రైతు, దెగ్లూర్‌, మహారాష్ట్ర  

తెలంగాణ నిర్ణయం చాలా బాగుంది

తెలంగాణ తీసుకొచ్చిన ధరణి చాలా బాగున్నది. అప్పటికప్పుడే సులువుగా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్‌ బాగుందని తెలంగాణలో ఉన్న మా బంధువులు చాలా సంతోషపడుతున్నారు. మాకిక్కడ ఆ సౌలత్‌ లేదు. తాసిల్‌ ఆఫీసుకు పొయ్యే అవసరం పడితే నరకం కనబడుతుంటది. మహారాష్ట్రలోనూ ఈ విధానం తీసుకొస్తే మేలు. - శివానంద్‌, దెగ్లూర్‌, మహారాష్ట్ర