సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 13:37:38

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1200 కోట్లు

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1200 కోట్లు

హైదరాబాద్‌ : మహిళా స్వయం సహకారా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1,200 కోట్లు ప్రతిపాదించినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం ఏందంటే.. ఆ సమాజంలో మహిళాభివృద్ధి స్థాయి మాత్రమే అని అంబేద్కర్‌ మహాశయుడు చెప్పారు. వారి మాటలు మననం చేసుకుంటూ మహిళా లోకానికి ప్రభుత్వం పక్షాన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మంత్రి తెలిపారు. మహిళల వికాసానికి, భద్రతకు, వారి ఆత్మగౌరవం కాపాడేందుకు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుందన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు, శిశువులకు ప్రతీ రోజు పాలు, గుడ్లతో కూడిన పోషకాహారం ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. అమ్మఒడి వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. కేసీఆర్‌ కిట్స్‌తో గర్భిణీలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, పోలీసు ఉద్యోగ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు రూ. 2,016 పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినుల కోసం 53 డిగ్రీ గురుకుల కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. మహిళలపై జరిగే అత్యాచారాలను, అఘాయిత్యాలను, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టడం కోసం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, షీ టీమ్స్‌ అప్రమత్తంగా పని చేస్తున్నాయి. మహిళలను వేధించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.


logo