గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 17:46:29

రాధిక హత్య కేసులో తండ్రే నిందితుడు

రాధిక హత్య కేసులో తండ్రే నిందితుడు

కరీంనగర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్‌ విద్యార్థిని రాధిక హత్య కేసులో నిందితుడు తండ్రే అని పోలీసులు తేల్చారు. ఈ కేసు వివరాలను కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి సోమవారం వెల్లడించారు. ఫిబ్రవరి 10న కరీంనగర్‌లోని విద్యానగర్‌లో దారుణ హత్యకు గురైన రాధిక కేసును జర్మన్‌ సాంకేతికతతో ఛేదించామని సీపీ తెలిపారు. రాధిక హత్యకు తండ్రి పక్కా ప్రణాళిక వేసుకున్నాడు. తమ ఇంట్లో కిరాయికి ఉన్న పోచయ్య కుటుంబాన్ని బలవంతంగా ఖాళీ చేయించాడు కొమురయ్య. పథకం ప్రకారం ఫిబ్రవరి 10న రాధికను కొమురయ్య హత్య చేశాడు అని సీపీ కమలాసన్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

ఈ కేసును ఎనిమిది బృందాలతో 21 రోజులు దర్యాప్తు చేశామన్నారు. రాధిక హత్య కేసులో బయటి వ్యక్తుల ప్రమేయం లేదని నిర్ధారించుకున్న పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫోన్‌ కాల్‌డేటా, హత్య జరిగిన టవర్‌లోని ఫోన్‌కాల్స్‌, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరే రాధికను హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో తండ్రి కొమురయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తండ్రి చెప్పిన వివరాల ఆధారంగా మార్చి 1న సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు పోలీసులు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ద్వారా రాధికను తండ్రే హత్య చేసినట్లు తేలింది.

అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను తండ్రి కొమురయ్య దిండుతో నొక్కి చంపి.. ఆ తర్వాత గొంతు కోశాడు అని సీపీ పేర్కొన్నారు. బంగారం, డబ్బు కోసం రాధికను హత్య చేశారని మొదట్లో నమ్మించిన తండ్రి.. చివరకు అతనే నిందితుడని తేలిపోయింది. అనారోగ్యంతో ఉన్న కుమార్తె వైద్య ఖర్చులు భరించలేకే ఈ అఘాయిత్యానికి కొమురయ్య పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే కుమార్తె వైద్యానికి రూ. 6 లక్షల వరకు ఖర్చు చేశాడు తండ్రి. ఏడాది క్రితం శస్త్ర చికిత్స తర్వాత రాధిక ఆరోగ్యం మెరుగుపడింది. అయినప్పటికీ గత కొన్ని రోజులుగా మళ్లీ అనారోగ్యంతో బాధపడుతోంది రాధిక. వైద్యం చేయించే స్థోమత లేకే రాధికను చంపాలని కొమురయ్య నిర్ణయించుకున్నాడు అని సీపీ కమలాసన్‌ రెడ్డి పేర్కొన్నారు.


logo
>>>>>>