సోమవారం 01 జూన్ 2020
Telangana - May 07, 2020 , 16:57:50

జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌ : జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్‌ వ్యాల్యుయేషన్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ... కేబినెట్‌ నిర్ణయం మేరకు ఇంటర్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పేపర్‌ కోడింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ నెల 12 నుంచి వాల్యుయేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. వాల్యుయేషన్‌కు గతంలో 12 సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 సెంటర్లకు పెంచినట్లు చెప్పారు. పేపర్‌ వాల్యుయేషన్‌కు వచ్చే లెక్చరర్స్‌కు రవాణా సౌకర్యం, వసతి కల్పిస్తామన్నారు.

కరోనా ప్రభావంతో పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పదో తరగతి పరీక్షలు మళ్లీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు అనుమతి రాగానే వారికి అన్ని వసతులు కల్పించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్‌ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేయొద్దన్నారు. నెలవారీగా మాత్రమే ఫీజులు వసూలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. లేకపోతే చర్యలు తప్పవన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పలు పాఠశాలలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


logo