ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 4: ఉస్మానియా యూనివర్సిటీలో త్వరలోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో పసిఫిక్ స్టడీస్ (ఐఐపీఎస్) ఏర్పాటు కానున్నది. ఈ అంశంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఉన్నతాధికారులు దమ్ము రవి, విశ్వాస్ విధు సప్కల్‌తో ఢిల్లీ శుక్రవారం రాత్రి చర్చించారు. ఓయూలోని సీఐపీ ప్రాంగణంలో ప్రతిపాదిత సెంటర్‌ను నెలకొల్పితే అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉంటుందని వారికి వినోద్‌కుమార్ సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు.. త్వరలోనే ఓయూను సందర్శిస్తామని చెప్పారు. అనంతరం వినోద్‌కుమార్ బృందం కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యంతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.