శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 00:58:51

భూములు చూపిస్తే సిటీలోనే ఇండ్లు

భూములు చూపిస్తే  సిటీలోనే ఇండ్లు

  • 30 ఏండ్ల కింద శివారులో ఎందుకు కట్టారు?
  • పేదలు ఆత్మగౌరవంతో ఉండేలా నిర్మాణం
  • మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి 
  • కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పరిశీలన

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరంలో వందల ఎకరాల భూమి ఉన్నదని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారనీ, అలాంటప్పుడు 30 ఏండ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పేరుతో శివారు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం ఎందుకు చేపట్టిందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మాణం పూర్తైన 15,560 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రులు శుక్రవారం పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. నగరంలో ఇండ్లు నిర్మించట్లేదని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారనీ.. కాంగ్రెస్‌ హయాంలో 30 ఏండ్ల క్రితం శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌, కూర్మన్‌గూడ, గౌరంపేట, నిజాంపేట, బండ్లపల్లి, రామేశ్వరం, రామేశ్వరం బండ, తుర్కయాంజాల్‌, శంషాబాద్‌, జవహర్‌నగర్‌, అమీన్‌పూర్‌, పాలమాకుల, గంధంగూడ, శాకంరాయి ప్రాంతాల్లో ఇండ్లు ఎందుకు నిర్మించారో చెప్పాలని భట్టి విక్రమార్కను మంత్రి తలసాని ప్రశ్నించారు. పేదల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌.. వారు ఆత్మగౌరవంతో ఉండేలా డబుల్‌ బెడ్‌రూంఇండ్లు నిర్మిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన పుల్లల డబ్బీల్లాంటి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లు ఇప్పటికీ ఎవరూ తీసుకోవడం లేదని మంత్రి విమర్శించారు. 145 ఎకరాలకు పైగా స్థలంలో ఇండ్ల నిర్మించి, కొల్లూరు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు సముదాయాన్ని ఓ అద్భుత కళాఖండం అని మంత్రి తలసాని అభివర్ణించారు.  నగర శివారు ప్రాంతాల్లో కట్టినప్పటికీ, 10 శాతం స్థానికులకు మిగతా 90 శాతం నగర పేదలకు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్‌ ఎప్పుడో ప్రకటించారని తలసాని గుర్తు చేశారు. 111 చోట్ల నిర్మిస్తున్న లక్ష వరకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లిస్టును జీహెచ్‌ఎంసీ హౌసింగ్‌ అధికారులతో పంపిస్తున్నామనీ, అక్కడికి వెళ్లి స్వయంగా పరిశీలించుకోవాలని తలసాని ప్రతిపక్షాలకు సూచించారు.  


logo