మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:12:43

ఎల్‌ఆర్‌ఎస్‌ గొప్పవరం

ఎల్‌ఆర్‌ఎస్‌ గొప్పవరం

  • క్రమబద్ధీకరణతో మెరుగుపడనున్న మౌలిక వసతులు: కేటీఆర్‌..
  • ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభం 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) గొప్ప వరమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. అనధికారిక లే అవుట్లలో తెలియక ప్లాట్లను కొనుగోలుచేసిన వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ ఆన్‌లైన్‌, మీ సేవ సర్వీసు, అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఇదే మంచి అవకాశమని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 15వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ని సద్వినియోగం చేసుకుంటే.. యాజమానులు భూములపై సర్వహక్కులతోపాటు ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని వివరించారు. వచ్చే అక్టోబర్‌ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజును వచ్చే ఏడాది జనవరి 31లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ మిగులు భూములు, దేవాదాయ భూములు, చెరువుల శిఖం భూముల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ వర్తించదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, జలమండలి ఎండీ దానకిశోర్‌ పాల్గొన్నారు. 


logo