మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 01:09:49

మీ డాటా పదిలం

మీ డాటా పదిలం

  • వివరాలు చెప్పారా? ...అంతే సంగతులు
  • డాటా మాఫియా మాయలో ఇరుక్కుంటున్నారు
  • మీ వ్యక్తిగత డాటాతో కోట్లలో వ్యాపారం.. మీరు అందించే డాటాతో సైబర్‌ నేరాలు
  • కిరాణా మొదలు షాపింగ్‌మాల్‌ దాకా.. మాఫియాగా డాటా విక్రయ కేంద్రాలు
  • అధికారికమైతేనే సమాచారమివ్వండి.. సలహా ఇస్తున్న నిపుణులు

ఆ మధ్య ఒక సినిమా రిలీజయింది. అందులో విలన్‌ పెద్ద టెక్నోక్రాట్‌. తనకున్న ఇంటెలిజెన్స్‌తో సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా వ్యక్తిగత డాటాను చోరీచేసి. వాళ్ల ఖాతాల్లోని సొమ్మును కాజేస్తుంటాడు. సినిమాలో అయితే ఇది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కానీ.. ఇదే పరిస్థితి నిజ జీవితంలో మనకే ఎదురైతే.. మన పరిస్థితి ఏమిటి? డాటా చౌర్యం అన్నది ఇప్పుడొక మాఫియా. షాపింగ్‌ చేసినప్పుడో.. హోటల్‌కు వెళ్లినప్పుడో.. వీకెండ్‌ రిసార్టుల్లో గడిపినప్పుడో.. మనం ఇస్తున్న వ్యక్తిగత వివరాలన్నీ మాఫియాచేతుల్లో పడుతున్నవని మీకు తెలుసా? మన డాటాతో కోట్లరూపాయల వ్యాపారం జరుగుతున్నది. మనం ఇచ్చిన సమాచారంతోనే సైబర్‌నేరాలు ఊపిరిపోసుకొంటున్నాయి. 

START <SPACE> <0> (సున్నా) ఎంపిక చేసుకొని 1909కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే ఆయా రంగాల నుంచి వచ్చే మెసేజ్‌లు బ్లాక్‌ అవుతాయి యూఎస్‌, ఆస్ట్రేలియా దేశాల్లో కస్టమర్‌ దగ్గర ఫోన్‌ నంబర్‌ తీసుకొంటే దానిని ఎందుకోసం వినియోగిస్తారో ముందుగానే నోటీస్‌ బోర్డులో పెడుతాయి. దాన్ని ఇతర పనుల కోసం వినియోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి-హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యాపార విస్తరణ పేరుతో చిన్న కిరాణా దుకాణం మొదలు షాపింగ్‌ మాల్స్‌, దవాఖానలు, ఫార్మా దుకాణాలు, విద్యాసంస్థలు.. ఇలా ఎక్కడికెళ్లినా ముందుగా పేరు, ఫోన్‌నంబర్‌, ఈ మెయిల్‌ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. షాపింగ్‌ చేస్తే డిస్కౌంట్లు, హాలిడే ట్రిప్స్‌ అంటే.. వినియోగదారులే ఎగబడి వివరాలు చేతిలో పెడ్తున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో బ్యాంకు వివరాలు, చిరునామా నమోదుచేస్తున్నారు. ఇంటింటికీ వచ్చే రియల్‌ఎస్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌లకు, వివిధరకాల పరికరాల కంపెనీల ప్రతినిధులకు అడిగిన వెంటనే వివరాలు ఇచ్చేయడం సర్వసాధారణంగా మారింది. వ్యక్తిగత వివరాలను బలవంతంగా తీసుకొనే అధికారం ఎవరికీ లేదనే విషయాన్ని ప్రజలు మరిచిపోతున్నారు. సొంతంగా డాటా మొత్తం చేతిలో పెట్టి మోసపోవడానికి సిద్ధమవుతున్నారు.మార్కెట్లో డాటాకో రేటు

వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు.. ఇలా ఏ రంగానికి చెందినవారి డాటా కావాలన్నా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ డాటా విక్రయం మాఫియాగా మారింది. విభాగం, ఏరియా ఆధారంగా ఒక్కోవ్యక్తి డాటా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఉంటుందని సాంకేతిక నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌ తెలిపారు. ఎక్కువ మొత్తంలో కొనుగోలుచేసే డాటాకు రాయితీ కూడా ఉంటుంది. రాజకీయ పార్టీ లు, కొత్తగా ఏర్పాటయ్యే వ్యాపార, వాణిజ్య సంస్థలు బల్క్‌గా డాటా కొంటున్నాయి. అందరికీ ఫోన్లు చేసి వ్యాపా ర విస్తరణకు ఉపయోగించుకుంటున్నాయి. ఏటా డాటా లావాదేవీలు రూ.కోట్లల్లోనే ఉంటాయి. వ్యాపార కోణంలో డాటాను సేకరించేవారితో ప్రజలకు తరచూ ఫోన్లు రావడం, మెయిల్స్‌ రావడం మినహా పెద్దగా ఇబ్బందులు లేవు.

నేరగాళ్లకు చిక్కితే ఖాతా ఖాళీ

డాటా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో పడితే మాత్రం బ్యాంకు ఖాతా ఖాళీ అవుతున్నది. ఫలానా చోట మీరు షాపింగ్‌ చేసినప్పుడు నింపిన కూపన్‌లో కారు గెలిచారని, ప్రైజ్‌ వచ్చిందని.. ముం దుగా ఫార్మాలిటీస్‌లో భాగంగా కొన్ని వేలు చెల్లించాలని జెండా ఎత్తేసిన నేరాలు ఎన్నోచూశాం. ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌కు పంపే లింకులు తెరువగానే ఫోన్‌లోని ఫొటోలు సహా బ్యాంకు ఖాతాల వివరాలు నేరగాళ్లకు చేరిపోతున్నాయి. స్విమ్‌ స్వాపింగ్‌ ద్వారా మీ ఫోన్‌కు రావాల్సిన మెస్సేజ్‌లను దారిమళ్లించి అదే ఓటీపీ నం బర్‌తో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసి ఖాతా గుల్ల చేస్తున్న ఘటనలు తెలిసిందే. ఏదో లింకులో రామ్సన్‌వేర్‌ వంటి వైరస్‌ను పంపడం, దాన్ని తెరువగానే ఫోన్‌ స్తంభించడం.. బిట్‌కాయిన్స్‌ రూపంలో డబ్బు చెల్లిస్తేనే తిరిగి అది పనిచేయడం వంటి నేరాలకు లెక్కేలేదు. 

అప్పుల యాప్‌కు మూలమిదే

ప్రస్తుతం రాష్ట్రంలో ఐదారుగురి ఆత్మహత్యలకు కారణమైన లోన్‌యాప్‌లకు ఇలాంటి డాటానే కీలకం. ఎక్కడో సేకరించిన డాటాతో మీకు లోన్‌ కావాలా అంటూ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపు తున్నారు. ఎలాంటి షరతులు లేవని నమ్మించి అవసరాల్లో ఉన్నవాళ్లను బుట్టలో పడేస్తున్నారు. రూ.50 వేలు రుణం తీసుకుంటే కనీసం రూ.4 లక్షలు చెల్లించేవరకు వేధిస్తున్నారు. అప్పటికే ఆ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ వివరాలు సేకరించుకొని, వారి వాట్సాప్‌ నంబర్లకు ఫ్రాడ్‌ అని, రుణం చెల్లించడం లేదని పంపుతున్నారు. ఈ అవమానం తట్టుకోలేకే ఇటీవల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. యూఎస్‌, ఆస్ట్రేలియా దేశాల్లో కస్టమర్‌ దగ్గర ఫోన్‌ నంబర్‌ తీసుకొంటే దానిని ఎందుకోసం వినియోగిస్తారో ముందుగానే నోటీస్‌ బోర్డులో పెడుతాయి. దాన్ని ఇతర పనుల కోసం వినియోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు.

చికాకు తప్పించుకోండిలా 

బిజీగా ఉన్న సమయంలో వివిధరంగాల కాల్‌ సెంటర్ల నుంచి వచ్చే కాల్స్‌ చికాకు పుట్టిస్తాయి. మెసేజ్‌లకు కొదవేఉండదు. వాటిని నిరోధించే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 1909కు ల్యాండ్‌లైన్‌, మొబైల్‌నంబర్‌ ద్వారా ఫోన్‌చేసి అందులో వచ్చే సమాచారం ఆధారంగా ఎంపిక చేసుకొని ఇలాంటి కాల్స్‌ను బ్లాక్‌ చేసుకోవచ్చు. START <SPACE> <PREFERENCE NO.> ఎంపిక చేసుకొని 1909కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే ఆయా రంగాల నుంచి వచ్చే మెసేజ్‌లు బ్లాక్‌ అవుతాయి.

START 0 - పూర్తి స్థాయిలో వ్యాపార కాల్‌ సెంటర్ల నుంచి వచ్చే ఎస్‌ఎంస్‌లు బ్లాక్‌ అవుతాయి.

START 1 - బ్యాకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ ఉత్పత్తులు, క్రెడిట్‌ కార్డులు

START 2 - రియల్‌ ఎస్టేట్‌

START 3 - విద్య

START 4 - వైద్యం

START 5 - కన్సూమర్‌ గూడ్స్‌,      ఆటోమొబైల్స్‌

START 6 - కమ్యూనికేషన్‌, బ్రాడ్‌ కాస్టింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐటీ

START 7 - టూరిజం  పెదవి దాటితే ముప్పే

సైబర్‌క్రైం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత వివరాలపై ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరికీ ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొనే అధికారంలేదు. అందుకే సహేతుకమైన, అధికారికమైన కారణాలు ఉంటే తప్ప వ్యక్తిగత వివరాలను బయటికి చెప్పొద్దు. మనం ఇచ్చే సమాచారం మోసగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నది.

- నల్లమోతు శ్రీధర్‌, సాంకేతిక నిపుణుడు 

యాప్‌ల డౌన్‌లోడ్‌లో జాగ్రత్త అవసరం

యాప్‌ల డౌన్‌లోడ్‌లో చాలా జాగ్రత్త గా ఉండాలి. ఐఫోన్లలో రిజిస్టర్‌ అయిన యాప్‌లు మాత్రమే ఉంటున్నందున ఎలాంటి ముప్పు ఉండదు. కానీ సాధారణ ఆండ్రాయిడ్స్‌లో యాప్‌ల డౌన్‌లోడ్‌ వల్ల ముప్పు పొంచి ఉంటుంది. కొన్నిసార్లు వ్యక్తిగత డాటాను ఇస్తుంటాం. 

- కే అనీశ్‌రావు, సాంకేతిక నిపుణుడు

ఆశకుపోతే అసలుకే ఎసరు

మీకు కూపన్‌ వచ్చిందని, లాటరీ తగిలిందని ఫోన్లు చేయడం, మెసేజ్‌లతో వేధిస్తుంటారు. వారి మాటలు నమ్మారంటే బోల్తాపడినట్లే. అనవసరంగా ఎక్కడబడితే అక్కడ వివరాలు ఇవ్వొద్దు. ఆశకు పోతే అసలుకే ఎసరు పడుతుంది. ఆశకుపోయి ఉన్నది పోగొట్టుకోవద్దు. 

- కేవీఎం ప్రసాద్‌, సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ