ఆదివారం 01 నవంబర్ 2020
Telangana - Sep 22, 2020 , 08:21:59

జూరాలకు 2లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో

జూరాలకు 2లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో

జోగులాంబ గద్వాల : కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో వచ్చిన ఇన్‌ఫ్లోను దిగువకు వదులుతున్నారు. మంగళవారం ఉదయానికి ప్రాజెక్టుకు 2,20,000 క్యూసెక్కుల వరద వస్తోంది. 26 గేట్లను ఎత్తి 2,16,626 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు 9.657 (టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1044 అడుగులు (8.850 టీఎంసీలు)గా ఉంది.

శ్రీశైలానికి పెరిగిన వరద..

శ్రీశైలం జలాశయానికి నిన్నటితో పోలిస్తే ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ఎగువ నుంచి 2,84,355 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు (215.8 టీఎంసీ)లు కాగా ప్రస్తుతం 884.5 అడుగులు (212.91) టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,05,313 క్యూసెక్కులు, కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 33 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 

నాగార్జునసాగర్‌ సాగర్‌ 14గేట్లు ఎత్తివేత..

 నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి 2,50,896 క్యూసెక్కుల వరద వస్తోంది. అధికారులు 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,50,896 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.20 అడుగులు (309.65 టీఎంసీలు) గా ఉంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.