గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Aug 11, 2020 , 03:52:32

పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు

పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు

  • నేటి నుంచి మొదలు.. 18 నాటికి నివేదిక
  • ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు
  • అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతాప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల పొరుగు రాష్ర్టాల్లోని పరిశ్రమల్లో పేలుళ్లు సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో అలాంటి ప్రమాదాలను నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని ఫ్యాక్టరీలు, మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమల్లో భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ను సోమవారం ట్విట్టర్‌ ద్వారా ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జయేశ్‌రంజన్‌ సోమవారం.. పరిశ్రమల్లో భద్రతా ఏర్పాట్లపై తనిఖీలకోసం బృందాలను ఏర్పాటుచేశారు. మంగళవారం నుంచి తనిఖీలు ప్రారంభంకానున్నాయి. ఐదు శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన ఈ బృందంలోని సభ్యులు వారి పరిధిలోని పరిశ్రమలను తనిఖీచేసి ఈనెల 18కల్లా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో విశాఖపట్నంలోని ఓ పరిశ్రమలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

దీంతో రాష్ట్రంలో ప్రమాదాలకు ఆస్కారమున్న అన్ని క్యాటగిరీల పరిశ్రమలను తనిఖీచేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ర్టానికి పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అయితే ఆ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వాటి పరిసరాల్లో నివసించే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమల యాజమాన్యాలు సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయా? లేదా ? అనే అంశంపై క్షుణ్ణంగా తనిఖీచేసి నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. తనిఖీ బృందాల్లోని కార్మికశాఖ అధికారులు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కల్పించిన భద్రతపై తనిఖీ చేస్తారు.  పరిశ్రమలన్నింటినీ ఒకసారి తనిఖీ చేయడం ద్వారా యాజమాన్యాలను అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడైనా లోపాలు, నిర్లిప్తత ఉంటే వాటిని సరిచేసుకోవడం, ప్రమాణాలు పాటించనివారిపై చర్యలు తీసుకోవచ్చని మంత్రి కేటీఆర్‌ భావిస్తున్నారు.  తనిఖీ బృందాలను జిల్లా స్థాయిలో సమన్వయపర్చే బాధ్యతను జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌కు అప్పగించారు. రాష్ట్రస్థాయిలో సమన్వయపర్చడానికి పాత జిల్లాల ప్రాతిపదికన పరిశ్రమలశాఖ కమిషనర్‌ కార్యాలయంలోని అధికారులను నోడల్‌ ఆఫీసర్లుగా నియమించారు.