బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 01:26:32

రాజధానిలో మతప్రచారకుల గుర్తింపు!

రాజధానిలో మతప్రచారకుల గుర్తింపు!

- రాంగోపాల్‌పేట, మల్లేపల్లి మసీదుల్లో బస

- విదేశాలకు చెందిన 24 మంది గుర్తింపు

- దవాఖానకు తరలించిన వైద్యారోగ్య సిబ్బంది

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ బేగంపేట/ మెహిదీపట్నం: మత ప్రచారం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఇరాన్‌, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌కు చెందిన 24 మంది నగరంలోని మసీదుల్లో ఆశ్రయం పొందుతున్నట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు వీరికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. కొంతమందిని క్వారంటైన్‌ చేశారు. ఇరాన్‌కు చెందిన ఎనిమిది మంది గతనెల 24న ఢిల్లీకి విమానంలో వచ్చి 29న రైలులో హైదరాబాద్‌కు చేరుకున్నారు. మల్లేపల్లిలోని బడా మసీదులో  బసచేశారు. అక్కడినుంచి ఈ నెల 18న రాంగోపాల్‌పేట డివిజన్‌లోని నల్లగుట్ట మసీదుకు వెళ్లారు. శుక్రవారం సమాచారం అందుకొన్న జీహెచ్‌ఎంసీ అధికారులు వైద్యపరీక్షలు చేయగా వారిలో కరోనా లక్షణాలు లేవని తెలిసింది. మసీదులోనే ఓ గదిలో 29 వరకు క్వారంటైన్‌ చేసినట్టు రాంగోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్‌ బాబు తెలిపారు. హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మల్లేపల్లి బడా మసీదుకు 18న ఇండోనేషియాకు చెందిన ఎనిమిది మంది వచ్చారు. జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం రాత్రి వీరిని గుర్తించి హబీబ్‌నగర్‌ పోలీసుల సహకారంతో నల్లకుంట ఫీవర్‌ దవాఖానకు తరలించారు. వీరితోపాటు కోరుట్ల ప్రాంతానికి చెందిన సయ్యద్‌ఇల్హాజుద్దీన్‌ను కూడా   తీసుకెళ్లారు. సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ మసీదులో మలేషియాకు చెందిన ఆరుగురు, థాయ్‌లాండ్‌కు చెందిన ఇద్దరు మత ప్రచారకులను గుర్తించి క్వారంటైన్‌ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 మందికిపైగా విదేశీ మతప్రచారకులను గుర్తించినట్టు శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌ తెలిపారు. 


logo