శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 01:32:36

సింగపూర్‌తో భారత్‌ చెలిమి

సింగపూర్‌తో భారత్‌ చెలిమి

  • మన పీవీ ఘనతలివీ 

భారత్‌తో చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో సాన్నిహిత్యం ఉన్న సింగపూర్‌తో చాలా కాలం దృఢమైన సంబంధాలు లేకుండేవి. భౌగోళికంగా కూడా సింగపూర్‌ భారత్‌కు ఎంతో దగ్గరగా ఉన్నది. ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో రెండు దేశాల మధ్య మళ్ళీ సాన్నిహిత్యం పెరిగింది. ప్రధాని పీవీ ప్రారంభించిన లుక్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగానే రెండు దేశాలు దగ్గరయ్యాయి. 1994 సెప్టెంబర్‌లో పీవీ సింగపూర్‌ పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలలో ఒక చరిత్రాత్మక సన్నివేశంగా చెప్పవచ్చు. ఈ పర్యటన సందర్భంగా సింగపూర్‌ దౌత్యాధికారి టోనీ సిద్దీఖ్‌ అత్యంత ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది భారత్‌ ఆసియాను పునర్దర్శించడంగా భావించాలి. మా స్వాతంత్య్ర సమరానికి మీరు మూల స్తంభాలు. కానీ ఆ తరువాత అదృశ్యమైపోయారు. ఇప్పుడు మళ్ళా మా వైపు చూశారు. ఇంతకాలం ఏమయ్యారు?’ అన్నారు.  చైనాతో సంబంధాలు ఇష్టం లేనివారికి భారత్‌ సౌహార్దత కలిసివచ్చింది. 

1950 దశకంలో నెహ్రూ కాలంలో ఇండొనీషియాలో అలీనోద్యమ సమావేశం జరిగింది. ఆ సందర్భంలో తూర్పు ఆసియా దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ తరువాత ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భారత్‌, సింగపూర్‌ వేర్వేరు శిబిరాల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ భారత్‌ కలిసి రావడం సింగపూర్‌ నాయకుల్లో సంతోషం నింపింది. ఒకప్పుడు భారత సంస్కృతి సింగపూర్‌ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ ఐదు  లక్షల మంది భారతీయులు ఆ చిన్న నగర దేశంలో ఉన్నారు. పీవీ పర్యటన తరువాత వాణిజ్య సంబంధాలు విస్తృతమయ్యాయి. భారత్‌తో పెట్టుబడి పెట్టే దేశాలలో సింగపూర్‌ ఎనిమిదవ స్థానంలో ఉన్నది. వాణిజ్య భాగస్వామ్యంలో తొమ్మిదవ స్థానంలో ఉన్నది. పెట్రోలియం, వజ్రాలు,నగలు, యంత్రసామాగ్రి మొదలైనవి భారత్‌ నుంచి సింగపూర్‌కు ఎగుమతి అవుతున్నాయి. సింగపూర్‌ నుంచి ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, సేంద్రియ రసాయనాలు, లోహాలు మొదలైనవి భారత్‌ దిగుమతి చేసుకుంటున్నది. 

ప్రపంచ మార్కెట్‌లో అడుగు పెట్టాలంటే మొదట ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో మొదటి అడుగు వేయాలని పీవీ అన్నారు. బహుళ జాతి కంపెనీలతో సంబంధాలకు  సింగపూర్‌ను మొదట చేరుకోవాలని భారత దేశంలోని వ్యాపార వర్గాల కూటమి డైరెక్టర్‌ జనరల్‌ తరుణ్‌ దాస్‌ వ్యాఖ్యానించారు. పీవీ సింగపూర్‌ పర్యటనలో భారత వ్యాపారస్థులను వెంట తీసుకుపోయారు. దీంతోపెద్ద ఎత్తున పెట్టుబడులకు అవగాహన కుదిరింది. 


logo