బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 07:32:58

కరోనా కట్టడికి..రైల్వే అప్రమత్తం

కరోనా కట్టడికి..రైల్వే అప్రమత్తం

మారేడ్‌పల్లి: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రైల్వే ప్రయాణికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రైల్వే జీఎం సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ కరోనా వైరస్‌ను అరికట్టేందుకు, కనీస అవసరాలను ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులకు కరోనా వైరస్‌పై ఎప్పటికప్పుడు అవగాహణ కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్నారు. రైల్వేస్టేషన్లలో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. మైక్‌ సౌండ్‌, టీవీ స్క్రీన్‌ల ద్వారా ప్రయాణికులకు అవగాహణ కల్పిస్తున్నారు. వైరస్‌ నివారణ వ్యాప్తి చేందకుండా రైల్వే ప్రయాణికులు మాస్కులను ధరించి ప్రయాణం చేస్తున్నారు. సిబ్బంది సైతం మాస్కులతో విధులకు హాజరవుతున్నారు.

రైల్వే స్టేషన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ 

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రెండు థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాలను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌తో పరీక్షించిన అనంతరం లోపలికి పంపిస్తున్నారు. ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానకు తరలిస్తున్నారు. దీంతో పాటు రైల్వే ప్రధాన ద్వారాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేసి రైల్వే ప్రయాణికులకు అందజేస్తున్నారు. దీంతో పాటు రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ ఫారాలు, విశ్రాంతి గదులు, మూత్రశాలలు, నీటి తొట్లతో పాటు తదితర ప్రాంతాలను రైల్వే సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాలను ప్రతి రెండు గంటలకు ఒకసారి నీటితో కడుగుతున్నారు.  రైలు కోచ్‌లు, టాయిలెట్లలో విడతలుగా క్రిమి సంహారకాలతో శుభ్రం చేస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు.. తగ్గిన ప్రయాణికుల రద్దీ

కరోనా వైరస్‌ ప్రభావంతో దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. యశ్వంతపూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడ-యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, హెచ్‌ఎస్‌ నాందేడ్‌-పుణే ఎక్స్‌ప్రెస్‌, పుణే- హెచ్‌ఎస్‌ నాందేడ్‌, తిరుపతి-కేఎస్‌ఆర్‌ బెంగుళూర్‌, కేఎస్‌ఆర్‌ బెంగుళూర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ అధిక సంఖ్యలో తగ్గింది. దీంతో రైల్వే శాఖకు అధిక మొత్తంలో ఆదాయం తగ్గిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. logo
>>>>>>